NTV Telugu Site icon

ఈ ఎన్నికల తరువాత జరిగేది అదే : ఈటల

హుజురాబాద్ ఉప ఎన్నిక సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల ప్రచారాల్లో వేగం, వేడి పెరుగుతోంది. మంగళవారం హుజురాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్ లో ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెద్ద పెద్ద స్కీంలకు ఇందిరానగర్- శాలపల్లి కేంద్రంగా మారిందన్నారు. శాలపల్లిలో దళితబంధు ఆరంభించి 65-66 రోజులైందని, ఈ స్కీం మొదటి ఇక్కడే లాంఛ్ చేయలేదని, భువనగిరి జిల్లా వాసాలమర్రిలో ప్రారంభించారని గుర్తు చేశారు. దళితబంధు నేను వద్దన్నట్లు దొంగ ఉత్తరం కేసీఆర్ సృష్టించాడని, నేను లెటర్ రాస్తే ఏ శిక్షకైనా సిద్ధమని ప్రకటించినట్లు తెలిపారు. దళితబంధుపై దొంగ ఉత్తరాలు సృష్టించి ఆపే ప్రయత్నం చేయవద్దని కోరానన్నారు. కానీ రాత్రి మళ్లీ కొత్త నాటకానికి తెరలేపాడు. నీవు తలకిందకు పెట్టి, కాళ్లు పైకి పెట్టి జపం చేసినా నీకు ఓట్లు వేయరని చెప్పాను. ఎన్నడూ లేని భయం ప్రజలో ఆవరించింది. నీవల్ల పేదరికం పెరిగిందని, అశాంతి ప్రభలుతోందని ప్రజలు భావిస్తున్నారన్నారు.

హుజురాబాద్ లో కేసీఆర్ పార్టీ ఓడిపోయిన తర్వాత.. తెలంగాణ మొత్తంలోనూ ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. నేను శపించడానికి ఋషిని కాకపోవచ్చు. నేను పూజలు చేసే పూజారిని కాకపోవచ్చు. కానీ ప్రజలంతా కేసీఆర్ చెప్పే మాటలకు, చేతలకు పొంతనలేదని అంటున్నారన్నారు. మాటలు చెప్పి, భయభ్రాంతులకు గురిచేసి పాలన సాగిస్తున్నాడు. పాలనలో అంతా డొల్లతనమే. ఆర్థికంగా రాష్ట్రం కుప్పకూలి పేదరికం పెరిగిపోయింది. ఉద్యోగాల వస్తాయని 1200 మంది అమరులైతే.. ఎవరికీ ఉద్యోగాలు రాలేదు. తల్లిదండ్రులు పిల్లలకు ఉద్యోగాలు వస్తే మురిసిపోవాల్సిన సమయంలో కూలీ పని చేసి పిల్లలకు పెడుతున్నారన్నారు.

ఎన్నికలప్పుడే నోటిఫికేషన్లు గుర్తొస్తాయి. ఎన్నికలప్పుడే దళితులు గుర్తుకు వస్తారు. సీఆర్ ప్రజలు మెచ్చే పద్ధతిలో పనిచేయడం లేదు. ఊర్లకు బార్లుగా మార్చారు. నాయకులను వెలగొట్టి కొంటున్నారు. ఓటుకు 20 వేలు, 30 వేలతో బేరం చేస్తున్నారు. కొప్పుల ఈశ్వర్, సుమన్ లాంటి వాళ్లు.. నీచంగా మాట్లాడుతున్నారు. నాకు నేనే దాడి చేయించుకుని సానుభూతి కోసం ఓట్లు అడుక్కుంటానని ప్రచారం చేస్తున్నారని అన్నారు.