NTV Telugu Site icon

Kamareddy: దారుణం.. డబ్బులు కట్టలేదని వేసిన కుట్లు విప్పేశారు..

Kamareddy

Kamareddy

Kamareddy: గాయాలకు కుట్లు వేసినందుకు డబ్బులు చెల్లించకపోవడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది రోగిపై దాడి చేసి, కుట్లు విప్పేశారు. రోగికి నరకం చూపించిన ఘటన కామారెడ్డి పట్టణంలోని అపెక్స్‌ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. కామారెడ్డి పట్టణానికి చెందిన శ్రీను అనే వ్యక్తి బైక్‌పై వెళుతూ అదుపుతప్పి కిందపడిపోయాడు. దీంతో శ్రీను తీవ్రంగా గాయాలు కావడంతో పట్టణంలోని అపెక్స్‌ ఆస్పత్రికి వెళ్లాడు. కన్సల్టేషన్‌ ఫీజు కింద రూ.300 చెల్లించాడు. ఆస్పత్రి సిబ్బంది అతని గాయాలకు కుట్లు వేసి.. వెయ్యి రూపాయలు బిల్లు వేశారు. అయితే బాధితుడి వద్ద నగదు లేకపోవడంతో క్రెడిట్‌ కార్డు ద్వారా డబ్బులు చెల్లిస్తానని చెప్పాడు. ఆస్పత్రి సిబ్బంది దీనికి అంగీకరించకపోవడంతో వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన ఆస్పత్రి సిబ్బంది బాధితుడితో పాటు అతడి స్నేహితులపై దాడికి పాల్పడ్డారు.

ఈ చర్యతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చివరికి రోగికి వేసిన కుట్లు విప్పేసి ఆస్పత్రి నుంచి బయటకు పంపించారు. దీంతో శ్రీను నరకయాతన చూశాడు. కుట్లు విప్పందంటూ వాపోయాడు. అయినా ఆస్పత్రి సిబ్బంది వినలేదు.. డబ్బులు కడితే కుట్లు విప్పమని లేదంటే ఇలాగే ఉంటుందని నరకం చూపించారు. కాసులకు తప్పా కనికరం చూపించని ఆస్పత్రి సిబ్బంది తీరుపై బాధితుడు ఆందోళనకు దిగాడు. సుమారు అరగంటపాటు అతని ఆందోళన కొనసాగింది. అనంతరం బాధితుడు పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్నాడు. అయితే ఈ ఘటనపై అధికారులు పట్టించుకోవాలని డిమాండ్ చేశాడు. రోగులపై కనికరం చూపించిన ఇలాంటి ఆస్పత్రులపై వేటు వేయాలని కోరారు.
Water Supply: నగరంలో 24 గంటల పాటు నీటి సరఫరా బంద్‌..