Etela Rajender: జైలు నుండి విడుదలైన కమలాపూర్ బీజేపీ నాయకులకు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఘనస్వాగతం పలికారు అనంతరం వారిని సన్మానించారు. ఈనేపథ్యంలో.. ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. 20ఏండ్లుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం ఉందని అన్నారు. పార్టీలు వేరైనా ప్రజలంతా కలిసి మెలిసి పనిచేసుకునే పద్ధతి ఉన్న నియోజకవర్గం హుజూరాబాద్ అని కొనియాడారు. అధికారం ఎవరీ శాశ్వతం కాదని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు జాగ్రత్త అని హెచ్చరించారు. చిల్లర వేశాలు మానాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యయుతంగా ప్రజల మనస్సు గెలువాలని స్పష్టం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు కేసులకు భయపడరని తెలిపారు. తన నియోజకవర్గ ప్రజలపై కేసీఆర్ పగపట్టారని ఆరోపించారు. అందుకే చాలా మందికి హుజూరాబాద్ లో లైసెన్స్ తుపాకులు ఇచ్చారని మండపిడ్డారు. పోలీసులు ఏకపక్షంగా అధికార పార్టీకి తోత్తులుగా మారారని ఆరోపణలు గుప్పించారు. మా నాయకులను టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకెళ్ళి చిత్రహింసలు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు ఈటెల రాజేందర్.
అయితే జనవరి 30న మంత్రి కేటీఆర్ కమలాపూర్ పర్యటన సందర్భంగా హుజురాబాద్ నియోజకవర్గ బీజేపీ నేతలు, కార్యకర్తలను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.. కాగా..మంత్రి కేటీఆర్ పర్యటన 24 గంటల ముందే బీజేపీ శ్రేణులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు అక్రమంగా తరలించడంపై బీజేపీ నాయకులు మండిపడ్డారు. అయితే.. మంత్రి పర్యటనను బీజేపీ ఆధ్వర్యంలో అడ్డుకోవడానికి ఎలాంటి పిలుపునివ్వకపోయినా అక్రమంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలను నిర్బంధించడం తగదని మండిపడ్డారు. ఇక తెలంగాణలో స్వేచ్ఛ వాతావరణం లేకుండా పోయిందని, రాష్ట్రంలో కేసీఆర్ పోలీసులు లేకుండా ఒక్క అడుగు కూడా వేసే పరిస్థితి లేకుండా పోయిందని ఈటెల రాజేందర్ మండిపడిన ఆయన ఇంతలా నిర్బంధాలు, అరెస్టులతో ప్రతిపక్షాలను భయపెట్టాలనుకోవడం మూర్ఖత్వమన్నారు. ఇక.. బీఆర్ఎస్ నేతల పర్యటన అనగానే ప్రతిపక్ష పార్టీ నేతలను అరెస్టు చేయడం ప్రభుత్వం అలవాటుగా మార్చుతుందని, తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ సర్కార్ కూని చేస్తుందన్నారు. కాగా.. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అనేక హామీలు, వాగ్దానాలు గుప్పించిందని.. తీరా ఎన్నికల్లో ఓటమి పాలైన అనంతరం వాటి ఊసే ఎత్తడం లేదన్నారు. దీంతో.. నియోజకవర్గంలో గతంలో కట్టించిన బిల్డింగులకు ఇప్పుడు శిలాఫలకాలు వేసుకొని మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం సిగ్గుచేటు అన్నారు.