Kaleshwaram Projcet : కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులపై రాష్ట్ర ప్రభుత్వం పెద్ద అడుగు వేసింది. ఈ పనుల కోసం కొత్త డిజైన్లు అవసరమని నిర్ణయించి, కన్సల్టెన్సీ సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) దరఖాస్తులను ఆహ్వానిస్తూ నీటిపారుదల శాఖకు చెందిన సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ డిజైన్లు తప్పనిసరిగా జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌యే) సూచనలు, దర్యాప్తు నివేదిక ఆధారంగా ఉండాలని స్పష్టంగా పేర్కొంది. ఆసక్తి గల సంస్థలు ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల లోపు దరఖాస్తులు సమర్పించాలి. అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు పరిశీలన జరగనుంది. సమర్పించిన ప్రతిపాదనలను ప్రభుత్వం సీల్డ్ కవర్‌లో భద్రపరచనుంది.
Jubilee Hills By-Election: ఆ తర్వాతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన..!
ఈ నిర్ణయానికి ప్రధాన కారణం 2023 అక్టోబరులో మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్‌లో పియర్స్ కుంగిపోవడం. అనంతరం అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో కూడా బుంగలు బయటపడటంతో ఈ ప్రాజెక్ట్ భద్రతపై తీవ్రమైన అనుమానాలు తలెత్తాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఎన్డీఎస్‌యే సహాయం కోరగా, సంస్థ పలు సూచనలు చేసింది. వాటిని పరిగణనలోకి తీసుకొని పునరుద్ధరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది.
మొదట మేడిగడ్డ సమస్య వెలుగులోకి వచ్చినప్పుడు అధికారులు డిజైన్ల కోసం ఐఐటీ రూర్కీ సహకారం పొందాలని భావించారు. అప్పట్లో నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ కూడా ఐఐటీ రూర్కీతో అధ్యయనం చేయించి నివేదిక సమర్పించింది. అయితే ఆ నివేదికలోని అనేక అంశాలను ఎన్డీఎస్‌యే తిరస్కరించడంతో ప్రభుత్వం కొత్త ఆలోచనలోకి వెళ్ళింది.
దాంతో ఇప్పుడు జాతీయ, అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థల సహకారం తీసుకోవాలని సీడీవో నిర్ణయించింది. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించేందుకు నీటిపారుదల శాఖ తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యేక సౌకర్యం కల్పించింది. ఈ నిర్ణయం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని కీలకమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు శాస్త్రీయ దృక్పథం, నిపుణుల సహకారం లభించనుంది.
Cyclone Effect: విశాఖపై వాయుగుండం ఎఫెక్ట్.. భీకర గాలులతో అతలాకుతలం..!