ఘన్‌పూర్ నియోజక వర్గంలో 2 పంటలు దిగుబడి వస్తుందంటే కేసీఆర్ చలువే అని మాజీ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలో ఇంటింటికి స్వచ్ఛమైన నీరు అందించేది కేవలం తెలంగాణలోనే. కాంగ్రెస్, బీజేపీ ల ఊక దంపుడు విమర్శలు మానుకోవాలి అని హెచ్చరించారు. ఎవరెన్ని రకాలుగా మాట్లాడినా కూడా నేను ఇతరులు మాట్లాడినట్టు మాట్లాడకుండా నాకు పని చేయడమే తెలుసు… సంవత్సరంలో ఇక్కడి పనులు పూర్తి చేయిస్తాను అని తెలిపారు.
గౌరవెళ్లి రిజర్వాయర్ ద్వారా మరియు మల్లన్న గండి ద్వారా చిల్పూర్ మండల చెరువులు నింపే ఏర్పాటు చేయిస్తా… ధర్మ సాగర్ మండలంలో నష్కల్ రిజర్వాయర్ లిఫ్ట్ ద్వారా వంగాల పల్లి, ధర్మాపురం నష్కల్ గ్రామాల చెరువులు నింపిస్తా… వచ్చే ఎలెక్షన్ల లోపు నియోజకవర్గంలో అన్ని చెరువులకు సాగు నీరు అందించడానికి కృషి చేస్తా… ఉప ముఖ్యమంత్రి ఉన్న సమయంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (CBSE) ను ధర్మసాగర్ మండలంలోని ఎలుకుర్తి గ్రామంలో ఏర్పాటు చేయాలని కోరాను. అందరం కూడా కేసీఆర్ నాయకత్వంలో పని చేద్దాము అన్నారు.
ఇక ఈ మధ్య కాలంలో నా పై దుష్ప్రచారం చేశారు, కేసీఆర్ నాకు సరియైన గౌరవం ఇస్తున్నారు, కష్టపడే వారికి కేసీఆర్ గౌరవిస్తారు. పని చేసే వాళ్ళెవరో, పని చేయని వాళ్ళెవరో, పైసలు ఎవరు తీసుకుంటారు, ఎవరు తీసుకోరో ప్రజలు గుర్తిస్తారు అని తెలిపారు. ఈ విషయంపై దుష్ప్రచారం చేయొద్దు, వర్గ విభేదాలు లేకుండా నియోజకవర్గ అభివృద్ధి కి కృషి చేద్దాం అన్నారు. అనంతరం స్టేషన్ ఘన్‌పూర్ , చిలుపూర్, జఫర్ గడ్, రఘునాథ్ పల్లి, లింగాల ఘన్‌పూర్ మండలాలకు చెందిన వివిధ గ్రామాల లబ్ధిదారులు 21 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు.
