Jana gana mana-telangana: భారత జాతీయ గీతం ‘జన గణ మన’ను నిత్యం పాఠశాలల్లో సాయంత్రం ఆలపిస్తుంటారు. ప్రభుత్వ, ప్రత్యేక కార్యక్రమాల్లో ముగింపు సందర్భంగా, ఆగస్టు 15, జనవరి 26 వంటి జాతీయ పర్వదినాలప్పుడూ పాడతారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల ఈ గీతాన్ని నిత్యం ఆలపిస్తుండటం విశేషం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేళ ఆయా ప్రాంతాల గురించి ప్రస్తావించటం సందర్భోచితం. నల్గొండ జిల్లాలోని తిప్పర్తి పట్టణంలో రోజూ పొద్దున్నే ఎనిమిదిన్నరకు జెండా వందనం నిర్వహిస్తారు.
అటుగా వెళ్లే ప్రతిఒక్కరూ అక్కడ ఆగి ఆ కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొంటారు. నడుచుకుంటూ వెళ్లేవారు, బైక్‌ల మీద రయ్‌మంటూ దూసుకుపోయేవారు ఆ జంక్షన్ దగ్గరికి వచ్చేసరికి తప్పనిసరిగా ఆగిపోతారు. బండిని పక్కన పెట్టి మరీ త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేస్తారు. ‘జన గణ మన’ అందుకుంటారు. తద్వారా జాతీయ గీతాన్ని, మూడు రంగుల జెండాని మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నారు. దేశభక్తిని చాటుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి 27వ తేదీ నుంచి దీన్ని నిత్య కృత్యంగా పాటిస్తున్నారు.
Cinema Halls: ఈ నెల ఇంట్లోనే. సినిమా హాళ్లకు వెళ్లేది లేదు
ఒక్క రోజు కూడా బ్రేక్ ఇవ్వకపోవటం చెప్పుకోదగ్గ విషయం. ఆదర్శవంతమైన ఈ ఆచరణకు జన గణ మన ఉత్సవ సమితి శ్రీకారం చుట్టింది. తిప్పర్తి పట్టణ ప్రజలు ‘మేము సైతం’ అంటూ ముచ్చటగా, ముదావహంగా సహకరిస్తున్నారు. ప్రోగ్రామ్ వివరాలను ఉత్సవ సమితి అధ్యక్షుడు కర్నాటి విజయ్ కుమార్ వెల్లడించారు. రోజూ ఉదయం 8 గంటల 10 నిమిషాల నుంచి దేశ భక్తి గీతాలను లౌడ్ స్పీకర్లలో ప్లే చేస్తారు.
సరిగ్గా ఎనిమిదిన్నరకు జాతీయ గీతాలాపన ప్రారంభమవుతుందంటూ ఒక నిమిషం ముందు అనౌన్స్ చేస్తారు. ప్రజల్లో జాతీయ స్ఫూర్తిని ఇనుమడింపజేసేందుకే ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా కొనసాగిస్తున్నామని విజయ్ కుమార్ పేర్కొన్నారు. తిప్పర్తి టౌన్ హైదరాబాద్-విజయవాడ హైవేలో ఉంటుంది. భాగ్య నగరం నుంచి 118 కిలో మీటర్లు. నల్గొండ పట్టణంలో 2021 జనవరి 23 నుంచి నిత్య జన గణ మన జరుగుతోందని, అక్కడ విజయవంతం కావటంతో తామూ అనుసరిస్తున్నామని విజయ్ కుమార్ తెలిపారు.
అప్పటి నల్గొండ జిల్లా ఎస్పీ, డీఐజీ ఏవీ రంగనాథ్ (ప్రస్తుతం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం జాయింట్ కమిషనర్) తమ ప్రయత్నాన్ని మెచ్చుకొని, సహాయ సహకారాలు అందించారని గుర్తుచేసుకున్నారు. నల్గొండ టౌన్ కన్నా ముందు ఇది కరీంనగర్‌లోని జమ్మికుంటలో ప్రారంభమైంది. అక్కడ 2017 ఆగస్టు 15 నుంచి రోజూ ఉదయం ఎనిమిదిన్నరకు ఆచరిస్తున్నారు. దాన్ని లోకల్ పోలీస్ ఆఫీసర్ ప్రశాంత్‌రెడ్డి ఆరంభించారు. ఇదిలాఉండగా.. ప్రస్తుతం నల్గొండ టూ-టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మొత్తం 12 కూడళ్లలో ఈ నిత్య జాతీయ గీతాలాపన జరుగుతోంది.
రోడ్డు వెడల్పు పూర్తయ్యాక వన్-టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతాల్లోనూ నిర్వహించనున్నట్లు విజయ్ కుమార్ చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కొలనూర్ అనే చిన్న గ్రామంలో కూడా గత నాలుగున్నరేళ్లుగా నిత్యం జన గణ మన పాడుతున్నారు. కొలనూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో రోజూ ఉదయం 8 గంటల కల్లా స్థానికులు లౌడ్ స్పీకర్‌లో జాతీయ గీతాన్ని ప్లే చేస్తూ ఆలపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులే కాకుండా అటుగా వెళ్లే సమీప ఊళ్ల ప్రజలు సైతం పాల్గొంటున్నారు.
ఈ ప్రాక్టీస్‌ని 2018 జనవరి 1న స్టార్ట్ చేశారు. అప్పటి సర్పంచ్ అబ్దుల్ రషీద్ మొదలుపెట్టారు. నాటి రాజన్న సిరిసిల్ల కలెక్టర్ కృష్ణభాస్కర్ ఎంకరేజ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు నిరంతరాయంగా జరుగుతోంది. దీనికి ఎవరినీ ప్రత్యేకంగా బొట్టు పెట్టి పిలవరు. అయినా రోజూ కనీసం 20-30 మంది హాజరవుతున్నారు. ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఆఫీసులో పని ఉన్నోళ్లు.