Raksha Bandhan: రాఖీ పండుగ వచ్చిందంటే చాలు.. తోబుట్టువుల కోసం ఓవైపు అన్నాదమ్ములు.. మరోవైపు అక్కాచెల్లెల్లు పరితపిస్తుంటారు.. ఈ రోజుల్లో ఏ బైక్ సౌండ్ వచ్చినా.. ఈ కారు ఆగినట్టు అనిపించినా.. మా చెల్లి వచ్చిందేమో.. మా అక్క దిగుతుందూమో అని ఎదురుచూసేవాళ్లు లేకపోలేదు.. అయితే, ఓ చెల్లి.. నాలుగు దశాబ్దాల తర్వాత తన అన్నకు రాఖీ కట్టింది.. సామాజిక న్యాయం కోసం సాయుధ పోరాటాన్ని నమ్మి అడవిలో పోరుబాట పట్టిన ఆ చెల్లి.. 40 ఏళ్లుగా ప్రతి ఏటా రాఖీ పండుగ రోజున తోడబుట్టిన అన్నను తలుచుకొని రాఖీ కట్టలేక పోతున్నాను అనే బాధను పంటి కింద దిగబట్టుకుని నాలుగు దశాబ్దాల అనంతరం ఈ రోజు తోడబుట్టిన అన్నకు రాఖీ కట్టింది..
Read Also: Tollywood : నిర్మాతల నిర్ణయం అంగీకరించట్లేదు.. రేపు ఫెడరేషన్ నిరసన
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన పసుల వసంత అలియాస్ బత్తుల గాంబాలు అలియాస్ శాంతక్క దండకారణ్యంలో నాలుగు దశాబ్దాల పాటు మావోయిస్టు ఉద్యమంలో పనిచేశారు.. కేంద్ర కమిటీ సభ్యురాలిగా.. నార్త్ బస్తర్ డివిజన్ ఇంఛార్జ్‌గా కూడా పనిచేసి అనారోగ్యంతో కొద్ది నెలల క్రితం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లా ఎస్పీ ముందు లొంగిపోయారు.. ఈ క్రమంలో నాలుగు నెలల తర్వాత కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి తిరిగి వచ్చారామె.. అయితే, ఆమె జీవితంలో ఈ రాఖీ పౌర్ణమి మర్చిపోలేని రోజుగా మారింది. నాలుగు దశాబ్దాలుగా కలవని తోడబుట్టిన అన్న బత్తుల రాజంకు రాఖీ కట్టి భావోద్వేగానికి గురైంది.. అన్నకు రాఖీ కడుతుండగా.. ఇటు వసంత.. అటు రాజం.. ఇద్దరి కళ్లలోనూ నీళ్లు తిరిగాయి.. చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు అన్న, చెల్లి.. మొత్తంగా సామాజిక న్యాయం కోసం సాయుధ పోరాటాన్ని నమ్మి అడవి బాట పట్టిన ఆ చెల్లి.. 40 ఏళ్ల తర్వాత అన్నకు రాఖీ కట్టి మురిసిపోయింది..