Cyber Fraud: జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం బట్టపల్లి పోతారం గ్రామానికి చెందిన రాకేష్ అనే యువకుడు సైబర్ మోసగాళ్ల బారిన పడ్డాడు. అప్పుల పాలై జీవనోపాధి కోసం ఇటీవలే ఇరాక్ వెళ్లిన రాకేష్, సోషల్ మీడియాలో ఫేస్బుక్ ద్వారా మోసగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నాడు. రాకేష్ ఫేస్బుక్లో ఒక పోస్ట్‌ను లైక్ చేయడంతో, యూట్యూబర్ హర్ష సాయి పేరుతో నకిలీ ప్రొఫైల్ సృష్టించిన సైబర్ ముఠా సభ్యులు అతనిని సంప్రదించారు. నమ్మకం కల్పించేందుకు హర్ష సాయి పేరుతో ఉన్న ఆధార్ కార్డు కాపీ పంపించారు. “నీ అప్పులు తీర్చడానికి ఐదు లక్షల రూపాయలు సహాయం చేస్తాం” అని ప్రలోభపెట్టారు.
ముఠా సభ్యులు రాకేష్‌కు రూ.6.5 లక్షలు పంపించాం అంటూ నకిలీ ఫోన్‌పే స్క్రీన్షాట్లు పంపారు. డబ్బులు ఖాతాలో జమ కాలేదని రాకేష్ అడిగినప్పుడు, “ఫండ్ రిలీజ్ కావాలంటే ముందుగా టాక్స్ చెల్లించాలి” అని నమ్మబలికారు. వారిపై నమ్మకం పెంచుకున్న రాకేష్ ఇరాక్‌లో ఉన్నప్పటికీ, తన కుటుంబ సభ్యుల ద్వారా అప్పు తెచ్చి విడతల వారీగా మొత్తం రూ.87,000 ను ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా పంపించాడు.
కానీ ఆ తర్వాత కూడా ముఠా సభ్యులు ఇంకా డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరింపులు మొదలుపెట్టారు. డబ్బులు చెల్లించకపోతే “డిజిటల్ అరెస్ట్ చేస్తాం”, “జైలుకి పంపిస్తాం” అంటూ ముఠా సభ్యులు రాకేష్‌ను భయపెట్టారు. అంతేకాకుండా భయపెట్టే వీడియోలను కూడా పంపి అతనిని తీవ్ర ఆందోళనకు గురిచేశారు. ఈ ఘటనతో మానసికంగా కుంగిపోయిన రాకేష్, చివరకు ఎన్టీవీని ఆశ్రయించి తన బాధను వెల్లడించాడు. సైబర్ మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఎవరైనా సోషల్ మీడియాలో డబ్బు సహాయం పేరుతో సంప్రదిస్తే నమ్మవద్దని ఆయన హెచ్చరించాడు.
Smartphone: స్మార్ట్ఫోన్లను ఈ విషయాల కోసం ఉపయోగిస్తే.. మీ జీవితం మారిపోయే ఛాన్స్..!