భారీవర్షాలు, వరదలతో భద్రాచలం సమీప ప్రాంతాల్లో గ్రామస్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి వరద బాధితులకు ఐటీసీ పేపర్ కర్మాగారం చేయూత అందిస్తోంది. సర్వస్వం కోల్పోయిన వారికి మేమున్నాం అని భరోసా కల్పిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ పేపర్ కర్మాగారం ఆధ్వర్యంలో వరద బాధితులకు విశేష కార్యక్రమాలు చేపడుతున్నారు. తమ BPL పాఠశాలలో ముంపు బాధితులకు పునరావాసం కల్పించడమే గాక మండల పరిధిలోని సుమారు 8వేలమంది వరద బాధితులకు ఆహారం పంపిణీ చేస్తున్నారు.
Bhatti Vikramarka: డైవర్ట్ పాలిటిక్స్ వద్దు… విదేశీ కుట్రను తేల్చాల్సిందే
పునరావాస కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం అందజేస్తున్నారు. గోదావరి వరద ప్రారంభమైన రోజు నుంచి నేటి వరకు ఈ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. కరోనా సమయంలోను సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని, వరద బాధితులకు తమవంతు సాయం అందిస్తున్నామన్నారు సంస్థ ఉద్యోగులు. మండలంలోని గ్రామాల్లో వంట సరుకులతో కూడిన కిట్లు అందించడంతో పాటు ప్రభుత్వాసుపత్రులకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు వితరణ చేశారు.
దీంతో పాటు మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అవసరమైన నోటు పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. గ్రామాల్లో అవసరం అయిన మౌలిక సదుపాయాల కల్పనకు ఐటీసీ యాజమాన్యం కృషి చేస్తున్నారు.బూర్గంపాడు మండలంలోని గ్రామాలకు మురుగు కాల్వలు నిర్మాణాలతో పాటు బస్ షెల్టర్లు నిర్మించారు. ఐటీసీ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలను పలువురు అభినందిస్తున్నారు. మునుముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని ఐటిసి PSPD యూనిట్ హెడ్ సిద్ధార్థ మహంతి పేర్కొన్నారు.