NTV Telugu Site icon

కేసీఆర్‌వి అన్ని అబద్ధాలే: ఈటల రాజేందర్‌

హుజురాబాద్‌ బైపోల్‌కు సమయం దగ్గర పడుతుండటంతో ఆయా పార్టీలు ప్రచారంలో స్పీడ్‌ను పెంచాయి. హుజురాబాద్ మండలం సింగాపూర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈటల రాజేందర్‌ అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌ వి అన్ని అబద్ధాలు, మోసాలేనని అన్నారు. హుజూరాబాద్ లో టీఆర్‌ఎస్‌ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారన్నారు.

మీటింగ్‌కి పోవద్దు అని డబ్బులు ఇచ్చే దుర్మార్గ పరిస్థితికి టీఆర్ఎస్ దిగజారిందన్నారు. పిల్లిని రూంలో వేసి కొడితే తిరగబడుతుంది. ప్రజలను కూడా ఎక్కువ ఇబ్బందిపెడితే వదిలి పెట్టరని జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్‌ను హెచ్చరించారు. ఇతర పార్టీ నుంచి గెలిచిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని ఇది అనైతికమన్నారు.

నన్ను వెన్నుపోటు పొడిచింది ద్రోహం చేసి కళ్లో మట్టి కొట్టింది కేసీఆర్‌ అని ఈటల రాజేందర్ ఆరోపించారు. 18 ఏళ్ల నుంచి ఉద్యమం కోసం వాడుకున్న వ్యక్తి కేసీఆర్‌ అని, నన్ను కుడి భుజం, ఎడమ భుజం అని చెప్పి ద్రోహం చేశారని, సీఎం పదవి కాలి గోటితో సమానమని నేడు ఆ పదవిని ఎందుకు వదలటం లేదన్నారు. ప్రజలు మనని నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తే కేసీఆర్ దుర్మార్గంగా వ్యవహరిస్తూ ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నాడన్నారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలని ఈటల రాజేందర్‌ కోరారు.