Inter Board : రాష్ట్ర ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంటర్ సిలబస్‌లో మార్పులు చేయనున్నట్లు ఇంటర్ బోర్డు సెక్రటరీ ప్రకటించారు. పరీక్షల పద్ధతిలో కూడా మార్పులు ఉంటాయని ఆయన తెలిపారు. విద్యార్థులకు ఆధునిక విద్యను అందించడమే ఈ నిర్ణయాల ప్రధాన ఉద్దేశమని వివరించారు. నవంబర్ నెల నుంచి ఇంటర్ విద్యార్థులకు ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) తరగతులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. దీనివల్ల భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులు సిద్ధం కావచ్చని బోర్డు భావిస్తోంది. ప్రభుత్వ కాలేజీల్లో ఈ ఏడాది గతేడాదికంటే ఎక్కువ అడ్మిషన్లు నమోదయ్యాయని తెలిపారు.
అదనంగా కొత్త పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చెప్పారు. ఇంటర్ కాలేజీలలో లెక్చరర్ల కొరత లేకుండా చూడాలని ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. త్వరలోనే 494 మంది గెస్ట్ లెక్చరర్లను నియమించనున్నారు. ఈ నెల 26న రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్-టీచర్స్ మీటింగ్ నిర్వహించనున్నారు. విద్యార్థుల భవిష్యత్తు, బోధన నాణ్యత, పాఠశాల-తల్లిదండ్రుల అనుసంధానం వంటి అంశాలపై చర్చించనున్నట్లు అధికారులు చెప్పారు. ఇక ఈ ఏడాది కూడా ఇంటర్ ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్ విధానం ఉండదని స్పష్టంచేశారు. విద్యార్థులు ఎలాంటి భయం లేకుండా, సమాన వాతావరణంలో పరీక్షలు రాసేలా చర్యలు తీసుకుంటున్నామని ఇంటర్ బోర్డు తెలిపింది.