NTV Telugu Site icon

TungaBhadra: తుంగభద్రకు వరద ఉధృతి

Tungabadra

Tungabadra

రుతుపవనాల ప్రభావం కారణంగా తుంగభద్ర డ్యాంకి వరద నీరు ఉప్పొంగుతోంది. కర్ణాటకను వరుణుడు ముందుగానే పలకరించడంతో తుంగభద్ర (Tungabhadra) నదికి ఇన్ ఫ్లో పెరిగింది. గత రెండు రోజులుగా ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో వరద పోటెత్తుతోంది. కర్ణాటకలో ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్ ఫ్లో వచ్చి చేరుతోంది. ఆర్డీఎస్ ఆనకట్టకు 10,743 క్యూసెక్కుల వరద వస్తుండగా, అధికారులు ఆర్డీఎస్‌ ప్రధాన కాల్వకు 643 క్యూసెక్కులు, దిగువకు 10,100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

దీంతో సుంకేసుల ఆనకట్టకు 10,100 క్యూసెక్కులు వస్తోంది. తుంగభద్ర డ్యాంకు కూడా వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రాజెక్టులోకి 26,858 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నదని అధికారులు వెల్లడించారు. తుంగభద్ర డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 1594 అడుగులుగా వుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 100. 855 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 12.54 టీఎంసీలుగా వుంది.

ఇన్ ఫ్లో ఇలాగే కొనసాగితే గతేడాది కంటే ముందుగానే డ్యామ్ నిండే అవకాశం వుందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. సాధారణంగా వర్షాలు బాగా పడినప్పుడు మాత్రమే వరద ప్రవాహం పెరుగుతుంది. ఏటా జూన్, జూలై మాసాల్లో రుతుపవనాల వల్ల వర్షాలు బాగా పడతాయి. అప్పుడు ప్రాజెక్టుకి వచ్చే ఇన్ ఫ్లో పెరుగుతూ వుంటుంది. అయితే, ఈసారి చాలాముందుగానే ప్రాజెక్టుకి వరద ప్రవాహం రావడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ రుతుపవనాల రాక కూడా ప్రారంభం కావడంతో గత ఏడాది కంటే ఈసారి ఇన్ ఫ్లో మరింతగా పెరుగుతుందని అంటున్నారు. తుంగభద్ర నుంచి ఔట్ ఫ్లో పెరిగితే తెలంగాణ ప్రాజెక్టులకు నీరు విడుదలయ్యే అవకాశం వుంటుంది.

Dasyam Vinay Bhasker: రేవంత్ ‘రచ్చబండ’ వ్యాఖ్యలకు కౌంటర్