ఢిల్లీలో జరిగిన న్యాయసదస్సులో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42 కు పెంచింనందుకు సీజే కు కృతజ్నతలు తెలిపారు. రాష్ట్ర హైకోర్టులో గతంలో 12 మంది న్యాయమూర్తుల ఉండగా కొత్తగా 17 మంది న్యాయమూర్తులను నియమించి, సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కేసుల సత్వర పరిష్కారానికి మార్గం చూపారన్నారు. ప్రస్తుతం 29 మంది న్యాయమూర్తులు తెలంగాణ హైకోర్టులో విధులు నిర్వహిస్తున్నారంటే సీజే కృషివల్లే అని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్ర న్యాయ వ్యవస్థను మరింతగా బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహాయసాకారాలు అందిస్తుంది.. కోర్టు భవనాల నిర్మాణం, న్యాయ వ్యవస్థలో పెరుగుతున్న సాంకేతికతను వినియోగించుకునే దిశగా అప్ డేట్ కావడం, మౌలిక వసతులను మెరుగుపరచడం, తగినంతగా న్యాయమూర్తులు, అధికారులు, సిబ్బంది నియామకం, ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు చర్యలు.. హైకోర్టు ప్రతిపాదనల మేరకు తక్షణమే నిధులు సమకూరుస్తున్నామని ఆయన తెలిపారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాద్ లో ఐఏఎంసీ నెలకొల్పేందుకు అవసరమైన మౌలిక వసతులు, స్థలం, నిధులను తెలంగాణ ప్రభుత్వం కేటాయించిందని ఆయన తెలిపారు. ఐఏఎంసీ ఏర్పాటుతో ప్రముఖ సంస్థల్లోని వివాదాలు సత్వరమే రాజీ మార్గం ద్వారా పరిష్కరించడానికి అస్కారముందన్నారు. న్యాయ వ్యవస్థలో మౌలిక వసతులను పెంపొందించడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ఇంద్ర కరణ్ రెడ్డి వెల్లడించారు.