Kanti velugu second phase: ఖమ్మంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం కేసీఆర్. జాతీయ నేతల చేతుల మీదుగా లబ్ధిదారులకు కళ్ల జోళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేరళ సీఎం పినరాయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పాల్గొన్నారు. దీంతో పాటు ఖమ్మంలో కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కార్యలయాన్ని నేతలు ప్రారంభించారు. రెండు హెలికాప్టర్లలో నేతలు ఖమ్మంకు చేరుకున్నారు. సీఎం కేసీఆర్ కు రాష్ట్రమంత్రులు తన్నీరు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, గాయత్రి రవి, బండి పార్థసారథి రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాతా మధుసూదన్ స్వాగతం పలికారు.
Read Also: V.Hanumantha Rao: రాముడు చెప్పాడా దేశంలో హిందువులే ఉండాలని.. బీజేపీపై వీహెచ్ ఫైర్
నలుగురు సీఎంలతో పాటు ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖమ్మంలో భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఆవిర్భావ సభకు జాతీయ నేతలు రావడంతో ఖమ్మం మొత్తం గులాబీ మయంగా మారింది. గతంలో పలు జిల్లాల్లో సీఎం కేసీఆర్ మాత్రమే కలెక్టరేట్లను ప్రారంభించారు. ఖమ్మం కలెక్టరేట్ ను మాత్రం మరో ముగ్గురు సీఎంలతో కలిసి కేసీఆర్ ప్రారంభించారు. కలెక్టరేట్ ప్రారంభం అనంతరం కలెక్టర్ వీపీ గౌతమ్ ను తన కుర్చీలో కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలిపారు సీఎం కేసీఆర్. అంతకుముందు నేతలంతా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ విశిష్టత గురించి సీఎం కేసీఆర్ జాతీయ నేతలకు వివరించారు.