Asaduddin Owaisi: అమిత్ షా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రి అవుతారంటూ కీలక ప్రకటన చేశారు. అయితే దీనిపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. బీజేపీకి సమాజంపై అంత శ్రద్ధ ఉంటే బీసీ కులగణణ ఎందుకు నిర్వహించడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో నవంబర్ 30 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తే వెనుకబడిన తరగతి (బీసీ) నాయకుడిని ముఖ్యమంత్రిగా చేస్తామని సూర్యాపేటలో జరిగిన ర్యాలీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన ఒక రోజు తర్వాత అసదుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
శుక్రవారం రాత్రి జహీరాబాద్ సభలో మాట్లాడిన ఓవైసీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండు కవలలు అంటూ విమర్శించారు. ఈ రెండు కూడా తెలంగాణలో విజయం సాధించలేవని ఆయన అన్నారు. ‘‘ అమిత్ షా గారు, మీకు బాధ్యతతో చెబుతున్నాను, మీరు కాంగ్రెస్ కవలలు అయ్యారు. తెలంగాణలో ప్రజలు మీకు అనుకూలంగా లేరు. మీకు బైబై చెబుతారు’’ అంటూ ఓవైసీ అన్నారు.
పార్లమెంట్‌లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ, ముస్లిం మహిళలకు సబ్ కోటా కల్పించాలన్న తన డిమాండ్‌కు ప్రధాని మోదీ గానీ, కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ గానీ మద్దతు ఇవ్వలేదని ఒవైసీ పేర్కొన్నారు. బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ప్రస్తావిస్తూ.. బీజేపీ వాషింగ్ మిషన్‌గా మారిందా..? అని ప్రశ్నించారు.
Read Also: Iran: హిజాబ్ ధరించలేదని అమ్మాయిపై దాడి.. నెల రోజుల కోమా తర్వాత మృతి
బీజేపీతో ఎంఐఎంకి సంబంధం ఉందని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల్ని ప్రస్తావిస్తూ.. 2019 ఎన్నికల్లో అమేథిలో ఆయన ఎలా ఓడిపోయారని అడిగారు. 2019లో బీజేపీ, కాంగ్రెస్ 185 స్థానాల్లో ప్రత్యక్ష పోటీలో ఉన్నాయని, ఆ ప్రాంతాల్లో ఎంఐఎం పోటీ చేయలేదని, కాంగ్రెస్ 16 స్థానాల్లో మాత్రమే విజయం సాధించిందని ఆయన ప్రస్తావించారు.
వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం పోటీ లేని చోట టీఆర్ఎస్ కి మద్దతు ఇవ్వాలని ప్రజలకు సూచించారు. ప్రాంతీయ పార్టీలు ఎక్కడున్నా ప్రజలకు ప్రాధాన్యత ఇస్తారని ఓవైసీ అన్నారు. బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ అధికారంలోకి వస్తే మీ సమస్యలపై స్పందించే వారే ఉండరని ఆయన అన్నారు.