HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!

  • రెండు వారాలు ప్రజావాణి నిలిపివేత
  • జూన్ 8, 15న కార్యక్రమం రద్దు
  • పెండింగ్ ఫిర్యాదుల పరిష్కారంపైనే ఫోకస్
  • జూన్ 22 నుంచి యథావిధిగా సేవలు
Hydraa

Hydraa

HYDRAA : హైదరాబాద్: ప్రతి సోమవారం ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ‘హైడ్రా ప్రజావాణి’ కార్యక్రమానికి మరో రెండు వారాల పాటు విరామం ప్రకటిస్తున్నట్లు హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిర్ణయం ప్రకారం జూన్ 8 , జూన్ 15వ తేదీల్లో ప్రజావాణి కార్యక్రమం జరగదు.

గతంలో వచ్చిన పెండింగ్ ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరించే లక్ష్యంతో మే 11వ తేదీ నుండి వరుసగా నాలుగు సోమవారాల పాటు ప్రజావాణికి విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ నెల 8వ తేదీన (సోమవారం) ఈ కార్యక్రమం తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే, ఇంకా కొన్ని ముఖ్యమైన పాత ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కరించాల్సి ఉన్నందున ఈ గడువును మరో రెండు వారాల పాటు పొడిగించాల్సి వచ్చిందని కమిషనర్ స్పష్టం చేశారు.

×
×
Ad

ఈ పెండింగ్ దరఖాస్తుల ప్రక్రియ పూర్తయిన తర్వాత, జూన్ 22వ తేదీ సోమవారం నుండి హైడ్రా ప్రజావాణి కార్యక్రమం యథాతథంగా కొనసాగుతుందని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు. కాబట్టి బాధితులు, ఫిర్యాదుదారులు ఈ మార్పును గమనించాలని హైడ్రా వర్గాలు కోరాయి.