HYDRA : హైదరాబాద్ నగరంలో విపత్తులను ఎదుర్కోవడం, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సహాయపడడం, ఆస్తులను కాపాడడం వంటి ముఖ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్న హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కు ప్రభుత్వం భారీగా నిధులను విడుదల చేసింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ ఇలంబర్తి బుధవారం ఉత్తర్వులు జారీ చేస్తూ మొత్తం రూ.69 కోట్లు హైడ్రాకు మంజూరు చేశారు. ముఖ్యంగా ఈ నిధులు బడ్జెట్‌లో ముందస్తుగా కేటాయించబడకపోయినా, అత్యవసర అవసరాలను దృష్టిలో పెట్టుకొని అదనంగా విడుదల చేసినట్టు ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు.
ఇది కాకుండా, హైడ్రాలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని జీహెచ్ఎంసీ నుంచి మ్యాచింగ్ గ్రాంట్స్ కింద మరో రూ.20 కోట్లు హైడ్రాకు విడుదల చేసినట్టు అధికారులు తెలిపారు. గత కొంతకాలంగా ఉద్యోగుల వేతనాలు పెండింగ్‌లో ఉండటంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ తాజా నిధుల విడుదలతో పెండింగ్‌లో ఉన్న వేతనాలను క్లియర్ చేయడానికి మార్గం సుగమం అవుతుందని సంబంధిత అధికారులు స్పష్టంచేశారు.
హైడ్రా విపత్తు నిర్వహణలోనే కాకుండా వర్షాకాలం, వరదలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు వంటి అనుకోని పరిస్థితుల్లో ముందుండి సహాయ చర్యలు చేపడుతుంది. అలాంటి సందర్భాల్లో రిస్క్ తీసుకుంటూ పనిచేసే ఉద్యోగులు చాలా కాలంగా వేతనాలు అందక నిరాశలో ఉన్నారు. ఈ కొత్త నిధుల మంజూరుతో వారి సమస్యలకు కొంతవరకు పరిష్కారం లభించనుంది. అదనపు నిధుల మంజూరుతో హైడ్రా మరింత సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఆధునిక పరికరాలు, రక్షణ సామాగ్రి కొనుగోలు చేయడంలో ఈ నిధులు ఉపయోగపడతాయి. దీని వల్ల అత్యవసర పరిస్థితుల్లో హైడ్రా వేగవంతంగా స్పందించగలదు. హైదరాబాద్ వంటి మెట్రో నగరంలో విపత్తు నిర్వహణకు ఎప్పటికప్పుడు నిధులు, సదుపాయాలు అవసరమవుతుంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడుదల చేసిన రూ.69 కోట్లు, జీహెచ్ఎంసీ నుంచి వచ్చిన రూ.20 కోట్ల గ్రాంట్ కలిపి హైడ్రా పనితీరుకు పెద్ద మద్దతుగా నిలుస్తాయని అధికారులు చెబుతున్నారు.
