Is the Congress party disappearing in the country?
దశాబ్దాల పాటు దేశాన్ని ఎదురులేకుండా పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతోంది. నిజానికి చాలా రోజుల నుంచి అది ఐసీయూ లోనే ఉంది. తాజాగా, ఐదు రాష్ట్రాల ఎన్నికలలో ఎదురైన ఘోర పరాభవం దేశంలో ఇక కాంగ్రెస్‌కు చోటు లేదా అనే అనుమానాలకు తావిస్తోంది. ఈ ఫలితాలు 135 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ గ్రాండ్ ఓల్డ్ పార్టీ మనుగడనే ప్రశ్నార్థకం చేశాయి. ప్రస్తుతం కాంగ్రెస్ చేతిలో ఉన్న మూడు రాష్ట్రాలలో పంజాబ్‌ను ఆప్‌కు అప్పగించింది. ఆ రాష్ట్రంలో పూర్తిగా తుడిచి పెట్టుకు పోయింది. కాంగ్రెస్ ఒకసారి ఓడిన చోట తిరిగి గెలవటం చాలా కష్టం. ఢిల్లీ, తెలంగాణ,ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు పంజాబ్ కూడా ఆ జాబితాలో చేరింది. ఢిల్లీని మరిచిపోయినట్టే పంజాబ్‌ను కూడా కాంగ్రెస్ మర్చిపొవాల్సింది.
2014 నుంచి ఒకటీ అరా తప్పిస్తే కాంగ్రెస్‌కు అన్నీ ఘోర పరాభవాలే. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ చరిత్రలోనే అత్యల్పంగా 44 లోక్‌సభ స్థానాలకు పడిపోయింది. చాలా మంది తమ జీవితకాలంలో హస్తం పార్టీని ఈ స్థితిలో చూస్తామని అనుకుని ఉండరు. సీట్లు మాత్రమే కాదు ఓటు షేర్ కూడా ఈ ఎనిమిదేళ్లలో 29 శాతం నుంచి 19 శాతానికి పడిపోయింది. ఏటేటా పడిపోవటమే తప్ప నిలబడింది లేదు. పరిస్థితి చూస్తుంటే ప్రధాని మోడీ పదే పదే చెప్పే కాంగ్రెస్ ముక్త్ భారత్ నిజమయ్యేలా ఉంది.
2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడ లేదు. ఈ మారు 52 సీట్లు మించలేదు. బీజేపీతో ముఖా ముఖి ఢీకొన్న స్థానాల్లో దాని విజయ శాతం పది లోపే. ప్రాంతీయ పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్‌ను బీజేపీ సునాయాసంగా ఓడించగలుగుతోంది. ఒకప్పుడు కాంగ్రెస్‌కు పెట్టని కోటలా ఉన్న ఈశాన్య రాష్ట్రాలు నేడు పూర్తిగా బీజేపీ వశమయ్యాయి. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ మళ్లీ లేవటం అటుంచి..పూర్తిగా కనుమరుగు కాకపోతే చాలు. ప్రియాంకా గాంధీ కాలికి బలపం కట్టుకుని రాష్ట్రమంతా తిరిగినా రెండు సీట్లకు మించి రాలేదు. ఓటు షేర్ నిండా మూడు శాతం కూడా లేదు. గాంధీలకు పెట్టిని కోటలైన అమేథీ, రాయ్‌బరేలీలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి కాలేకపోవటం దానిని దుస్థితికి నిదర్శనం. ఇన్నాళ్లూ ఆ పార్టీ క్యాడర్‌కు ప్రియాంక కరిశ్మా మీద కొంత నమ్మకం ఉండేది. ఆమెను తమ తురుపు ముక్కగా బావించే వారు. కానీ ఈ దెబ్బతో ఆమె మీద పెట్టుకున్న ఆశలు కూడా ఆవిరయ్యాయి.
కాంగ్రెస్‌కు ఈ దుస్థితి ఎవరో వల్లనో వచ్చింది కాదు. అంతా దాని స్వయంకృతాపరాధమే. యూపీఏ పదేళ్ల పాలనలో ప్రధాని మన్మోహన్ సింగ్ అయినా ప్రభుత్వ పగ్గాలు మాత్రం తల్లీ కొడుకుల చేతిలోనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారిందనే విమర్శలు వచ్చాయి. ఇక యూపీఏ టూలో వెలుగు చూసిన అనేక భారీ కుంభకోణాలు కాంగ్రెస్ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీయటమే కాదు బీజేపీకి బలమైన అస్ర్తాలుగా మారాయి. మరోవైపు కొంత కాలంగా పార్టీని నాయకత్వ సమస్య వేధిస్తోంది. అధ్యక్ష పగ్గాలు చేపట్టిన రాహుల్ గాంధీ 2019 ఓటమితో ఆ పదవి నుంచి తప్పుకున్నారు. సోనియా గాంధీ ఆరోగ్యం సహకరించకపోయినా పార్టీ పగ్గాలు తిరిగి ఆమె చేతికే వెళ్లాయి. ఇదే సమయంలో పార్టీలో సీనియర్ నేతలు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. రాహుల్ వ్యవహారశైలి కూడా వారికి ఏమాత్రం నచ్చటం లేదు. తాజా పరాభవాలతో వారు మళ్లీ అధిష్టానాన్ని ఇరుకున పెట్టవచ్చు.
కాంగ్రెస్ పార్టీ ఇంకా పడిపోకుండా తిరిగి నిలబడాలంటే ముందు అది గాంధీ ఇమేజ్ నుంచి బయటపడాలి. గాంధీ పేరుతో ఇక ఏ మాత్రం ఓట్లు రాలవని తేలిపోయింది. కనుకనే కేజ్రీవాల్, మమతా బెనర్జీ వంటి నాయకులు కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించే ప్రయత్నంలో ఉన్నారు. ఆ ప్రయత్నాల్లో విజయవంతం అవుతున్నారనటానికి పంజాబ్ ఒక ఉదాహరణ. వచ్చే రోజుల్లో గుజరాత్, హర్యానా, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో ఇది పునారవృతం కావచ్చు. దీనిని కాంగ్రెస్ ఇప్పటికైనా గుర్తించాలి. బీజేపీ రాత్రికి రాత్రి ఈ స్థాయికి చేరలేదు. దాని ఎదుగుదల వెనక ఎన్నో వ్యూహాలు, ఎంతోమంది నిరంతర శ్రమ ఉంది. నరేంద్ర మోడీ, యోగి ఆదిత్యనాథ్ వంటి ప్రజాకర్షణ కలిగిన నేతలు కాంగ్రెస్‌లో లేరు. ఇందిర, రాజీవ్ తర్వాత అలాంటి నేతలు లేరు. రాహుల్ గాంధీకి అవకాశం ఉన్నా ఆయన రాజకీయాలను ఇప్పటికీ సీరియస్ గా తీకుంటున్నట్టు అనిపించదు. ఎన్నికల ముందు హడావుడి, సందర్భానుసారం ట్విట్టర్ ప్రటనలు మినహా ఇస్తే ఆయన ప్రజాల్లోకి దూసుకుపోవటం లేదు. ఈ విషయంలో ఆయన కన్నా ప్రియాంక గాంధీ ముందున్నారు. కానీ ఆమె కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతిన్న తరువాత ఎంట్రీ ఇచ్చారు..అదేదే కొన్నేళ్ల ముందు చేసి ఉంటే ఇప్పుడు ఆమె పార్టీలో గొప్ప ప్రజాకర్షక నేతగా ఎదిగే వారు. కనీసం యూపీఏ 2 లో కొంత కాలం రాహుల్‌ను ప్రధానిని చేసినా ఆయన పొలిటికల్ స్టేచర్ పెరిగి ఉండేది. ఇప్పటికీ పార్టీలో రాహుల్ పాత్ర ఫలానా అని చెప్పలేని పరిస్థితి.
కాంగ్రెస్, బీజేపీ ముఖాముఖి తలపడే హిందీ బెల్ట్‌లో హస్తం పార్టీ బలోపేతం కాకపోతే ఆప్ వంటి ఇతర పార్టీలు అక్కడ కూడా తిష్ట వేయటం ఖాయం. ఎందుకంటే కాంగ్రెస్‌ను పట్టుకుని ఎవరూ ఎక్కువ కాలం ఉండరు. రాజకీయ శూన్యత ఏర్పడినపుడు ఎవరో ఒకరు దానిని పూర్తి చేస్తారు. కొత్త వారికి అవకాశం ఇస్తుంది. పంజాబ్‌లో అదే జరిగింది. రేపు గుజరాత్‌లో అదే జరుగుతుంది. ఇక వ్యూహ రచనలు ఆమలు చేయటంలో కూడా కాంగ్రెస్ ఘోరంగా విఫలమవుతోంది. ఇప్పటి వరకు రాహుల్ గాంధీ అనుసరించిన ఏ వ్యూహమూ ఫలితం ఇవ్వలేదు.
కాంగ్రెస్ ముందు ఇప్పుడు మిగిలింది ఒకే ఒక్క మార్గం. పార్టీని మూలల నుంచి నుంచి బలోపేతం చేయాలి. మరో ఐదేళ్లు అధికారం గురించి మర్చిపోయి కొత్త తరం నాయకత్వాన్ని సృష్టించిటంపై దృష్టి కేంద్రీకరించాలి. బూత్ స్థాయి నుంచి పార్టీని తిరిగి సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే బీజేపీని ఎదుర్కోవటం కాంగ్రెస్ సాధ్యం. లేని పక్షంలో కాంగ్రెస్ కూడా వామపక్షాల సరసన చేరుతుంది. నిజానికి కాంగ్రెస్‌లా వామపక్షాలు ఢిల్లీ పీఠం ఎక్కలేదు. కానీ తమ సైద్ధాంతిక నిబద్ధత, హక్కుల పోరాటాలతో ఇప్పటికీ ప్రజల మధ్య ఆ పార్టీ సజీవంగా ఉంది. చట్ట సభల్లో బలం లేకపోవచ్చు కాని ప్రజాక్షేత్రంలో వామపక్షాల ప్రాధాన్యత ఇప్పటికీ తగ్గలేదు.
మరోవైపు, కాంగ్రెస్ కేంద్రంలో ప్రతిపక్షంలో కూర్చుంది ఇప్పటి వరకు కేవలం పదిహేనేళ్లే. యాబై ఏళ్ల పాటు అధికారం చెలాయించింది. కేవలం ఎనిమిదేళ్లు అధికారం లేకపోతే దాని పరిస్థితి ఇంతలా దిగజారుతుందా..ఇది నిజంగా ఆశ్చర్యమే. నూటికి నూరు పాళ్లు దీనికి కాంగ్రెస్ నాయకుల నిర్లక్ష్యమే కారణం. ఇప్పటికైనా కాంగ్రెస్ పెద్దలు తమ తప్పులను గుర్తించాలి. గెలుపు, ఓటమితో సంబంధం లేకుండా నిరంతరం ప్రజల మధ్య ఉండాలి. కలిసి వచ్చే పార్టీలతో ప్రజల సమస్యలపై పోరాటం విస్తృతం చేసి ప్రజలలో తిరిగి కాంగ్రెస్‌పై నమ్మకం కలిగించాలి. ఇలా కాకుండా బీజేపీకి వ్యతిరేకించే వారికి కాంగ్రెస్ మినహా మరో గత్యంతరం లేదని కాంగ్రెస్ విశ్వసించినంత కాలం పడిపోవటమే ఉంటుంది కానీ లేవటం ఉండదు. ఈ సత్యం ఇప్పటికైనా బోధపడితే మంచింది…లేకపోతే ఇప్పుడు ఉన్న ఆ కొన ఊపిరి కూడా ఆగిపోవటానికి ఎంతో సమయం పట్టదు!!