హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్‌నెం 2 లో అర్థరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. రోహిత్ అనే వ్యక్తి తాగినమత్తులో అతివేగంగా కారు నడుపుతూ రోడ్డు దాటుతున్న ఇద్దరు యువకులను ఢీ కొట్టడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. కారు దూసుకెళ్లడంతో బీహార్‌కు చెందిన త్రిభువన్‌రాయ్, ఉపేందర్‌కుమార్ దాస్ అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. గమనించిన స్థానికులు వెంటనే రోహిత్‌ను పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు రోహిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే త్రిభువన్‌రాయ్ రెయిన్‌బో ఆసుపత్రిలో ఆఫీస్ బాయ్ గా పనిచేస్తుండగా, ఉపేందర్ కుమార్ దాస్ అసిస్టెంట్ కుక్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.