NTV Telugu Site icon

Telangana Cabinet: బీసీ రిజర్వేషన్‌, ఎస్సీ వర్గీకరణపై సర్కర్‌ ఫోకస్‌.. నేడు కేబినెట్‌, అసెంబ్లీలో చర్చ

Cabinet

Cabinet

Telangana Cabinet: ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లు విషయంలో తెలంగాణ ప్రభుత్వం జెట్ స్పీడుతో ముందుకుపోతోంది. రాష్ట్రంలో ఏ సామాజికవర్గం లెక్క ఎంత అనేది ప్రభుత్వం దగ్గర ఉంది. రాష్ట్రంలో 3 కోట్ల 54 లక్షల మంది ఇచ్చిన వివరాలు సర్కారు దగ్గరున్నాయి. మొత్తంగా కోటీ 12లక్షల 15వే కుటుంబాల వివరాలు నమోదు చేశారు. కులగణనలో 96 శాతానికి పైగా జనాభా పాల్గొంది. సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీ జనాభా 46.25 శాతమని లెక్క తేలింది. ముస్లిం మైనారిటీల్లో బీసీ జనాభా 10.08 శాతంగా ఉంది. ముస్లిం మైనారిటీల్లో బీసీలు కలిపి మొత్తం బీసీల జనాభా 56.33 శాతంగా తేలింది. రాష్ట్రంలో ఓసీ జనాభా 15.79 శాతం ఉంటే.. ముస్లిం మైనారిటీల్లో ఓసీ జనాభా 2.48 శాతం ఉంది. రాష్ట్రంలో మొత్తం ముస్లిం మైనారిటీ జనాభా 12.56 శాతమని సర్వే లెక్క తేల్చింది. ఇక ఎస్సీ జనాభా 17.43 శాతం ఉండగా.. ఎస్టీ జనాభా 10.45 శాతం ఉంది.

Read Also: CM Chandrababu: ఇంఛార్జ్‌ మంత్రులకు సీఎం కీలక ఆదేశాలు.. ఆ బాధ్యత మీదే..!

మరోవైపు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలు కోసం కసరత్తు పూర్తయింది. కేబినెట్ సబ్ కమిటీ సిఫారసులతో పాటు, ఏకసభ్య జ్యూడిషియల్ కమిషన్ సిఫారసులు ప్రభుత్వానికి అందాయి. బీసీ రిజర్వేషన్లతో పాటు ఎస్సీ వర్గీకరణ నివేదికలను కేబినెట్ మీటింగ్‌లో ప్రవేశపెడతారు. ఇవాళ శాసనసభ ప్రత్యేక సమావేశంలో చర్చిస్తారు. ఉభయ సభల్లో ఈ రెండింటిపై డిస్కస్ చేస్తారు. ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకోవాలంటూ ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేస్తోంది. దేశంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసే మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణే అంటూ ముఖ్యమంత్రి చేసిన ప్రకటను కట్టుబడి ఉండాలని ఆయన కోరారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై చర్చించేందుకు ఈసారైనా మాజీ సీఎం కేసీఆర్ సభకు రావాలని కాంగ్రెస్ పిలుస్తోంది! గులాబీ బాస్ వస్తారా? రారా అన్నది ఆసక్తికరంగా మారింది.

Read Also: Ratha Saptami in Tirumala: తిరుమలలో రథసప్తమి వేడుకలు.. ప్రత్యేక, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

బీసీలకు చాలా ఏండ్ల తర్వాత మేలు జరగబోతోందని సర్కారు చెబుతోంది. అడ్డుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని మంత్రి పొన్నం హెచ్చరించారు. కులగణన కోసం ఇన్నాళ్లు ఉద్యమం చేసిన పోరాట యోధులకు అభినందనలు తెలిపారు. ప్రధాన రాజకీయ పార్టీ నేతలు సర్వేలో పాల్గొనలేదని పొన్నం విమర్శించారు. కేసీఆర్‌ కుటుంబంలో ఒక్క కవిత తప్పించి ఎవరూ సర్వేకు వివరాలు ఇవ్వలేదని గుర్తు చేశారు. సర్వేలో ఎక్కడైనా పొరపాట్లు జరిగి ఉంటే తమ దృష్టికి తీసుకురావొచ్చని, సరి చేస్తామని మంత్రులు క్లారిటీ ఇచ్చారు.