Heavy Traffic: దసరా పండుగకు వెళ్లిన నగరవాసులు స్వగ్రామాల నుంచి తిరిగి నగరం బాట పట్టారు. దీంతో ఆదివారం సాయంత్రం నుంచి రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. సోమవారం నుంచి కార్యాలయాలు తెరుచుకోవడంతో చాలా మంది ఆదివారం నగరానికి చేరుకుంటున్నారు. దీంతో వివిధ టోల్ ప్లాజాల వద్ద వందలాది వాహనాలు బారులు తీరాయి. పలు అదనపు కౌంటర్ల ద్వారా పంపినప్పటికీ వాహనాల రాకపోకలు విపరీతంగా ఉండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. 65వ నెంబరు జాతీయ రహదారిపై ఉదయం నుంచి ట్రాఫిక్ పెరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్, నల్గొండ జిల్లా కేతేపల్లి టోల్‌గేట్ వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పంతంగి టోల్‌గేట్ వద్ద 16 గేట్లకు గాను 10 గేట్ల ద్వారా వాహనాలను హైదరాబాద్ వైపు పంపించారు. సాధారణ రోజుల్లో 30 వేల నుంచి 35 వేల వాహనాలు తిరుగుతున్నాయని, దసరా పండుగ సందర్భంగా 50 వేలకు పైగా వాహనాలు తిరుగుతున్నాయని టోల్ గేట్ నిర్వాహకులు తెలిపారు.
Read also: Different Weather: రాష్ట్రవ్యాప్తంగా భిన్న వాతావరణం.. సతమతమవుతున్న ప్రజలు..
బీబీనగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా వద్ద కిలోమీటరుకు పైగా వాహనాలు బారులు తీరాయి. కేతేపల్లి మండలం కొర్లపహాడ్ శివారులోని టోల్‌ప్లాజా వద్ద వాహనాల సంఖ్యకు అనుగుణంగా అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయకపోవడంతో కిలోమీటరు మేర వాహనాలు నాలుగు లైన్లతో బారులు తీరాయి. ఆదివారం 35 వేల నుంచి 40 వేల వాహనాలు ప్రయాణించాయని సిబ్బంది తెలిపారు. మరోవైపు ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో నార్కట్‌పల్లి-అద్దంకి రాష్ట్ర రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామం వద్ద రాజీవ్ రహదారిపై టోల్ గేట్ వద్ద ఆదివారం కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ టోల్ ప్లాజా వద్ద ఆదివారం సాయంత్రం సుమారు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అయితే సాయంత్రానికి తెలంగాణ జిల్లాల నుంచి బయలుదేరిన నగరవాసులు అర్ధరాత్రి దాటిన తర్వాత ఇళ్లకు చేరుకోవడం కనిపించింది.
Hyderabad Mayor: హైదరాబాద్ మేయర్ పై కేసు నమోదు.. కారణం ఇదే..