చలికాలం ప్రారంభం కావడంతో పొగమంచు హైదరాబాద్ నగరాన్ని కప్పేస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం తెల్లవారుజామున రాజేంద్రనగర్-హైదర్ షాకోట్ ప్రధాన రహదారిపై కారు బీభత్సం సృష్టించింది. పొగమంచు కారణంగా రోడ్డు కనబడక పోవడంతో ఓ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు వారిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కారు సన్ సిటీ నుంచి మెహిదీపట్నం వైపు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
Read Also: కిడ్నాపైన యువతిని కాపాడిన టిక్‌టాక్
కాగా స్థానికుల సమాచారం ప్రకారం నార్సింగ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద ఘటనపై విచారణ చేపట్టారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు బహదూర్‌పురా ప్రాంతానికి చెందిన అహ్మద్, షేక్ మతీన్, సోహేల్, ఫైజల్‌గా గుర్తించారు. తమ స్నేహితుడు జైద్ ఖాన్‌ను సన్ సిటీ వద్ద వదిలి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని బాధితులు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.