Site icon NTV Telugu

Revanth Reddy: ఢిల్లీ టూర్‌లో రేవంత్‌రెడ్డి.. ప్రధాని, కేంద్రమంత్రులతో వరుస భేటీలు

Pmmodi

Pmmodi

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హస్తిన పర్యటనలో బిజిబిజీగా గడుపుతున్నారు. పర్యటనలో భాగంగా ఉదయం ప్రధాని మోడీని కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు రావాల్సిందిగా ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ముద్రించిన గ్లోబల్​సమ్మిట్​ఆహ్వాన పత్రికను ప్రధానికి అందించారు. దాదాపు ప్రధాని మోడీతో 30 నిమిషాల పాటు సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఎంచుకున్న వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా 3 ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వృద్ధి లక్ష్యంగా తెలంగాణ భవిష్యత్తు సంకల్పంతో ముందుకు సాగుతుందని రేవంత్‌రెడ్డి వివరించారు.

ఇది కూడా చదవండి: Jharkhand: హేమంత్ సోరెన్‌ ప్రభుత్వంలో ప్రకంపనలు.. అధికార మార్పుపై జోరుగా చర్చ

ఇక పర్యటనలో భాగంగా కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అశ్విని వైష్ణవ్‌ను కలిశారు. అలాగే పార్లమెంట్ దగ్గర మల్లిఖార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీలను కూడా రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క కలిశారు. గ్లోబల్ సమ్మిట్‌కు రావాల్సిందిగా ఆహ్వానం పలికారు.

ఇది కూడా చదవండి: Imran Khan: ఆసిమ్ మునీర్ భారత్‌తో యుద్ధానికి ఆరాటపడుతున్నాడు.. ఇమ్రాన్ ఖాన్ సోదరి సంచలన వ్యాఖ్యలు

అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక రచించింది. ఇందుకోసం తెలంగాణ రైజింగ్​2047 విజన్​డాక్యుమెంట్‌ను రూపొందించింది. నీతి అయోగ్​సలహాలు, సూచనలతో పాటు అన్ని రంగాల నిపుణుల మేథోమథనంతో ఈ డాక్యుమెంట్ తయారు చేశారు.

ఇక హైదరాబాద్​మెట్రో రైలు రెండో దశ విస్తరణకు తగిన అనుమతులు ఇవ్వాలని ప్రధాని మోడీని రేవంత్‌రెడ్డి కోరారు. మొత్తం 162.5 కిలోమీటర్ల పొడవునా విస్తరించే ప్రతిపాదనలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అందజేసింది. రూ.43,848 వేల కోట్ల అంచనా వ్యయమయ్యే ఈ ప్రాజెక్టును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్​వెంచర్‌గా చేపట్టేందుకు ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే హైదరాబాద్​రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి కేబినెట్ ఆమోదంతో పాటు ఫైనాన్సియల్ అప్రూవల్​ఇవ్వాలని, దక్షిణ భాగం నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరారు. రీజనల్ రింగ్ రోడ్డు వెంట ప్రతిపాదనల్లో ఉన్న రీజనల్​రింగ్ రైలు ప్రాజెక్టును కూడా వీలైనంత తొందరగా చేపట్టాలని విన్నవించారు.

అలాగే హైదరాబాద్​నుంచి అమరావతి మీదుగా బందర్​పోర్ట్ వరకు 12 లేన్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే, హైదరాబాద్​నుంచి బెంగుళూరు హై స్పీడ్​ కారిడార్‌ను అభివృద్ధి చేసేందుకు గ్రీన్‌ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం చేపట్టేలా కేంద్రం ప్రత్యేక చొరవ చూపాలని కోరారు.

అంతేకాకుండా హైదరాబాద్​నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి నిరంతరాయంగా రవాణా సదుపాయం ఉండేలా టైగర్ రిజర్వ్ మీదుగా మన్ననూర్​నుంచి శ్రీశైలం వరకు ఫోర్‌లేన్ ఎలివేటేడ్​ కారిడార్​నిర్మాణ ప్రతిపాదనలను ఆమోదించాలని ప్రధానికి రేవంత్‌రెడ్డి వినతిపత్రం అందించారు.

డిసెంబర్ 8, 9 తేదీల్లో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ నిర్వహించాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం హైదరాబాద్‌లో భారీ ఏర్పాట్లు చేసింది. 4 వేల మందికి పైగా ప్రముఖులను ఆహ్వానించింది. ‘తరలిరండి-ఉజ్వల తెలంగాణలో పాలుపంచుకోండి’ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

 

Exit mobile version