NTV Telugu Site icon

చోరీ కేసును ఛేదించిన సిబ్బందికి రివార్డులు: సీపీ స్టీఫెన్‌ రవీంద్రా

ఇటీవల కాటేదాన్ బ్యాటరీ పరిశ్రమలో పెద్ద మొత్తంలో నగదును ఎత్తికెళ్లిన కేసును ఛేదించిన మైలారేదేవ్‌పల్లి పోలీసులు, శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులను బుధవారం సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రా, అభినందించి రివార్డులను అందజేశారు. వివరాల్లోకి వెళ్తే.. కాటేదాన్లో ఉన్న ఓ బ్యాటరీ పరిశ్రమలో బీహార్ రాష్ట్రానికి చెందిన మహ్మద్ మసూద్ పదేండ్లుగా నమ్మకంగా పని చేస్తున్నాడు.

కాగా యజమాని తెచ్చిన డబ్బులు ఆఫీసు అల్మారాలో పెట్టడం గమనించిన మసూద్ ఈ నెల 1 వ తేదీ రాత్రి బీహార్‌కు చెందిన తన స్నేహితులు మహ్మద్ షాబాజ్, ఇంతియాజ్, నయీమ్, సదాకత్తో కలిసి అల్మార తాళాన్ని పగుల గొట్టి రూ. 50 లక్షల 30 వేలు చోరీ చేసి పరారయ్యారు. పోలీసులు మసూద్‌ను విచారించగా దొంగతనం చేసిన తీరును వివరించాడు. మైలారేదేవ్‌పల్లి పోలీసులు, శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు బీహార్ వెళ్లి మసూద్, షాబాజ్ను చాకచక్యంగా అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ. 11 లక్షల 15 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరూ నిందితులను రిమాండ్‌కు తరలించారు. మిగతా ముగ్గురిని త్వరలోనే పట్టుకుంటామని సీపీ స్టీఫెన్‌ రవీంద్రా తెలిపారు.