Site icon NTV Telugu

MLA Raja Singh: కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై రాజాసింగ్ రియాక్షన్.. ఆ విషయంలో ఎక్కడికైనా, ఎప్పుడైనా రావడానికి సిద్ధం!

Rajasingh

Rajasingh

MLA Raja Singh: తెలంగాణ బీజేపీలో అంతర్గత పోరు కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యే రాజా సింగ్‌ “సీనియర్ నాయకుడు” అని, తనను “సామాన్య కార్యకర్తను” అని పేర్కొనడమే కాకుండా, రాజా సింగ్ చెప్పినట్లు తాము పాటిస్తామని రాష్ట్ర కమలం పార్టీ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతుంది. దీంతో కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై గోషామహల్ శాసన సభ్యులు రాజాసింగ్ స్పందించారు. ఈ సందర్భంగా వ్యక్తిగత విభేదాలను విడిచి పెట్టి, ఐక్యంగా లక్ష్య సాధన కోసం పని చేద్దామని కోరారు. మీరు ఎప్పుడు కలిస్తానని చెప్పిన అప్పుడు వచ్చి కలుస్తానన్నారు. పార్టీలోని ప్రతి ఒక్కరూ బాగుండాలని, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలనేది నా ఉద్దేశ్యం.. వ్యక్తిగత లబ్ధి, పదవుల కోసం తాను ఎప్పుడూ పని చేయలేదని రాజాసింగ్ వెల్లడించారు.

Read Also: Jasprit Bumrah: ఎట్టకేలకు టెస్టు కెప్టెన్‌ ఎంపికపై మౌనం వీడిన జస్‌ప్రీత్ బుమ్రా.. ఏమన్నాడంటే..?

అయితే, పార్టీని బలోపేతం చేయడం కోసం అంకితభావంతో పని చేశాను అని ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. తెలంగాణలోని మొత్తం 119 నియోజకవర్గాలలో బీజేపీ విజయం సాధించడంపై దృష్టి పెట్టడానికి బదులుగా, పార్టీకి నిస్వార్థ సేవ చేసినప్పటికీ, తనను మాత్రమే లక్ష్యంగా చేసుకుని, అడ్డంకులు సృష్టించడం జరుగుతోంది అని పేర్కొన్నారు. ఒక పార్టీ కార్యకర్తను ఇబ్బంది పెడితే ఏం లాభం?.. ఇది పార్టీకి ఏమైనా ఉపయోగపడుతుందా? అని ప్రశ్నించారు. తాను ఎప్పుడూ పార్టీకి అనుకూలంగా నిలబడ్డాను.. ఈ రోజు కూడా నా కోసం కాకుండా, పార్టీ ఐక్యత కోసమే పని చేస్తున్నాను, లక్షలాది మంది కార్యకర్తల మనోబలాన్ని కాపాడుకోవడం కోసం మాట్లాడుతున్నాను అని చెప్పుకొచ్చారు. కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నాను.. కొంచెం సమయం కేటాయించండి.. వ్యక్తిగతంగా కలిసి, తమ సమస్యలను పరిష్కరించుకుందాం అన్నారు. కిషన్ రెడ్డి ఎక్కడికి, ఎప్పుడు అనేది నిర్ణయిస్తే తాము రావడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. తాను పార్టీని విభజించడానికి కాదు– ఐక్యంగా ఉండటానికి ఇక్కడ ఉన్నాను అని ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పుకొచ్చారు.

Exit mobile version