Tragedy: మేడ్చల్‌లో తీవ్ర విషాదం.. బకెట్‌ నీటిలో పడి ఏడాదిన్నర చిన్నారి మృతి

  • సూరారంలో విషాద ఘటన
  • ఇంట్లో ఆడుకుంటూ నీటి బకెట్‌లో పడి చిన్నారి మృతి
Child

Child

Tragedy: మేడ్చల్ జిల్లా సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి బకెట్‌లో పడి ఏడాదిన్నర వయసున్న చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. రెప్పపాటులో జరిగిన ఈ ఘటన ఆ నిరుపేద కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరారంలో నివాసముంటున్న దంపతులు రోజువారీ కూలి పనులకు వెళ్లారు. ఇంట్లో వారి పిల్లలు మాత్రమే ఉన్నారు. ఆ సమయంలో పదేళ్ల పెద్ద కుమార్తె చాందిని వాష్‌రూమ్‌కు వెళ్లింది. అదే సమయంలో ఆడుకుంటూ తిరుగుతున్న ఏడాదిన్నర చిన్నారి, ఇంట్లో నీటితో నింపి ఉంచిన బకెట్ వద్దకు వెళ్లింది. ప్రమాదవశాత్తు బకెట్‌లోకి తలకిందులుగా పడిపోవడంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందింది.

కాసేపటి తర్వాత బయటకు వచ్చిన అక్క చాందిని, బకెట్‌లో పడి అచేతనంగా పడి ఉన్న చిన్నారిని చూసి కేకలు వేసింది. చుట్టుపక్కల వారు వచ్చి చూసేసరికి చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. కూలి పనులకు వెళ్లిన తల్లిదండ్రులకు విషయం తెలియడంతో వారు హుటాహుటిన ఇంటికి చేరుకుని బోరున విలపించారు. కళ్లెదుటే అల్లారుముద్దుగా పెంచుకుంటున్న చిన్నారి విగతజీవిగా పడి ఉండటం చూసి స్థానికులు కంటతడి పెట్టారు. సమాచారం అందుకున్న సూరారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.