KTR: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ ఉదయం నాంపల్లి ప్రత్యేక కోర్టుకు హాజరుకానున్నారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై ఆయన పరువునష్టం దావా వేశారు. మంత్రి కొండా సురేఖపై దాఖలైన పరువునష్టం దావా కేసులో కేటీఆర్ వాంగ్మూలాన్ని ప్రజాప్రతినిధుల కోర్టు నేడు (శుక్రవారం) నమోదు చేయనుంది. ఈనేపథ్యంలో ఇవాళ ఉదయం 11.30 గంటలకు నాంపల్లి కోర్టులో కేటీఆర్ హాజరుకానున్నారు. ఈ కేసులో సాక్షులుగా ఉన్న తుల ఉమ, బాల్కసుమన్, సత్యవతి రాథోడ్, దాసోజు శ్రవణ్‌కుమార్‌ల వాంగ్మూలాలను కూడా నమోదు చేయనున్నట్లు మేజిస్ట్రేట్ శ్రీదేవి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సెక్షన్ 356 బీఎన్ఎస్ ప్రకారం కేటీఆర్ వాంగ్మూలం కీలకం కానుంది. తాజాగా గాంధీ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొండా సురేఖ తనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తన ప్రతిష్టకు భంగం కలిగించారంటూ కేటీఆర్ ఈ నెల 3న నాంపల్లి క్రిమినల్ కోర్టులో పరువునష్టం కేసు వేశారు. ఈ పిటిషన్‌ను ఈ నెల 14న విచారించిన కోర్టు విచారణను 18వ తేదీకి వాయిదా వేసింది. కేటీఆర్ సహా సాక్షుల వాంగ్మూలాలను శుక్రవారం(18) నమోదు చేస్తామని కోర్టు తెలిపింది. ఈ క్రమంలో నేడు బీఆర్‌ఎస్ నేతలు కోర్టుకు హాజరుకానున్నారు. కాగా, కేటీఆర్ తరపు న్యాయవాది 23 రకాల ఆధారాలను కోర్టులో సమర్పించారు.
Railway Ticket Booking: ఇకపై 60 రోజుల ముందే రైలు బుకింగ్‌ల ముందస్తు రిజర్వేషన్