Kishan Reddy vs Asaduddin Owaisi: ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పాస్‌పోర్టు, భారత పౌరసత్వంపై చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఒవైసీ వ్యాఖ్యలు చట్టపరంగా ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా ఉన్నాయని పేర్కొంటూ, పాస్‌పోర్టు మరియు పౌరసత్వం మధ్య ఉన్న చట్టపరమైన తేడాను ఆయన అవగాహన చేసుకోవాలని సూచించారు. ప్రజాప్రతినిధిగా, న్యాయవాదిగా ఉన్న అసదుద్దీన్ ఒవైసీ బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి అన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించే ముందు పౌరసత్వ చట్టం–1955, పాస్‌పోర్ట్ చట్టం–1967లను మరోసారి అధ్యయనం చేయాలని సూచించారు. ఆయన వ్యాఖ్యలు చట్టంపై అవగాహన లోపాన్ని, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను గందరగోళానికి గురిచేసే ప్రయత్నాన్ని సూచిస్తున్నాయని విమర్శించారు.
విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఇచ్చిన వివరణ ప్రకారం భారత పాస్‌పోర్టు విలువలేనిదని అర్థం కాదని, పాస్‌పోర్టు ఒక్కటే భారత పౌరసత్వానికి తుది ఆధారం కాదని మాత్రమే స్పష్టం చేసిందని కిషన్ రెడ్డి తెలిపారు. భారత పౌరసత్వం రాజ్యాంగం మరియు పౌరసత్వ చట్టం–1955 ప్రకారమే నిర్ణయించబడుతుందని వివరించారు. పాస్‌పోర్ట్ చట్టం–1967లోని సెక్షన్ 20 ప్రకారం ప్రజాహితం దృష్ట్యా భారత పౌరుడు కాని వ్యక్తికీ కేంద్ర ప్రభుత్వం పాస్‌పోర్టు లేదా ట్రావెల్ డాక్యుమెంట్ జారీ చేసే అధికారం కలిగి ఉందని గుర్తు చేశారు. గతంలో కూడా ఇలాంటి ఉదాహరణలు ఉన్నాయని, అందువల్ల పాస్‌పోర్టును మాత్రమే పౌరసత్వానికి తుది ఆధారంగా పరిగణించలేమని స్పష్టం చేశారు.
ఇది కొత్త నిబంధన కాదని, 1967లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అమల్లోకి వచ్చిన చట్టమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దాదాపు ఆరు దశాబ్దాలుగా అమల్లో ఉన్న చట్టాన్ని మోదీ ప్రభుత్వంపై నెట్టడం అవగాహన లోపమో లేదా వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నమో అవుతుందని వ్యాఖ్యానించారు. అలాగే, పౌరసత్వ చట్టం–1955 ప్రకారం జననం, వంశపారంపర్యం, నమోదు లేదా నేచురలైజేషన్ ద్వారా మాత్రమే భారత పౌరసత్వం లభిస్తుందని వివరించారు. 2013లో బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పులో కూడా పాస్‌పోర్టు, ఆధార్, జనన ధ్రువీకరణ పత్రాలు మాత్రమే పౌరసత్వాన్ని నిరూపించడానికి సరిపోవని స్పష్టం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎలాంటి కొత్త విధానాన్ని ప్రకటించలేదని, ఇప్పటికే అమల్లో ఉన్న చట్టాలు, న్యాయస్థానాల తీర్పులను మాత్రమే మరోసారి పునరుద్ఘాటించిందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
𝐓𝐡𝐞 𝐫𝐞𝐦𝐚𝐫𝐤𝐬 𝐛𝐲 𝐇𝐨𝐧'𝐛𝐥𝐞 𝐌𝐏 𝐒𝐡𝐫𝐢 𝐀𝐬𝐚𝐝𝐮𝐝𝐝𝐢𝐧 𝐎𝐰𝐚𝐢𝐬𝐢 𝐨𝐧 𝐩𝐚𝐬𝐬𝐩𝐨𝐫𝐭𝐬 𝐚𝐧𝐝 𝐜𝐢𝐭𝐢𝐳𝐞𝐧𝐬𝐡𝐢𝐩 𝐚𝐫𝐞 𝐥𝐞𝐠𝐚𝐥𝐥𝐲 𝐢𝐧𝐜𝐨𝐫𝐫𝐞𝐜𝐭, 𝐚𝐧𝐝 𝐦𝐢𝐬𝐥𝐞𝐚𝐝𝐢𝐧𝐠
As a public representative and a trained barrister, Shri Owaisi is… pic.twitter.com/L6d1BfkXoa
— G Kishan Reddy (@kishanreddybjp) June 26, 2026

