Kishan Reddy: హైదరాబాద్ లో వరుసగా హిందూ దేవాలయాల విధ్వంసం పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇది నాలుగో సంఘటన.. అయినా స్పందించరా.. అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ లో హిందూ దేవాలయ వరుసగా దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది మతోన్మాద శక్తులు దాడికి పాల్పడి మతకల్లోలాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. కొన్ని రోజుల్లోనే హైదరాబాద్ నగరంలో ఇది నాలుగో సంఘటన జరగడం బాధాకరం అన్నారు. హిందూ దేవాలయాలపై విగ్రహాలపై దాడి చేసిన వారు దొంగతనాలు చేయడానికి వచ్చారని అన్నారు.
మరికొంతమంది మతిస్థిమితం లేకుండా దాడులు చేస్తున్నారని పోలీసులు చెప్పడం కరెక్ట్ కాదన్నారు. నగరంలో హిందు పండుగలు జరుపుతున్న వేళ రాత్రి పది దాటిన తర్వాత డీజేలు సౌండ్ సిస్టం పెడితే పోలీసులు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్న వారు ఇలాంటి సంఘటనలు జరిగితే ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదు? అని ప్రశ్నించారు. ఈ ఘటనకు పాల్పడిన వారు ఎంతటి వారైనా అరెస్టు చేసి వారి వెనుక ఎవరెవరి హస్తము ఉన్నాదో గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం ఘటనపై గవర్నర్ దృష్టికి తీసుకెళ్తామని కిషన్ రెడ్డి తెలిపారు.
Read also: Minister Seethakka: దివ్యాంగులు ఆఫీసర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.. మెసేజ్ చేస్తే చాలు..
దుర్గమ్మ నవరాత్రి పూజల సందర్భంగా పలు సంఘటనలు చోటు చేసుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాంపల్లి ఘటన మరిచిపోకముందే మరో ఘటన చోటుచేసుకుందన్నారు. దుండగులు దుర్గామాత ఆలయాన్ని చోరీ చేసేందుకు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు రాలేదని, విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు వచ్చారని తెలిపారు. రాత్రి వేళల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి సికింద్రాబాద్‌లో ఉన్న ముత్యాలమ్మ విగ్రహాన్ని తరలించారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో హిందూ దేవాలయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
రాత్రి వేళల్లో ఆలయాల వద్ద పోలీసుల పర్యవేక్షణ ఉండాలని కిషన్ రెడ్డి కోరారు. కాగా, సికింద్రాబాద్‌లోని కమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయంలోని అమ్మవారి విగ్రహాన్ని రాత్రి సమయంలో దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహం పగులగొట్టిన శబ్దం వినిపించడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. ఒక దుండగుడు పట్టుబడ్డాడు. మరో వ్యక్తి పారిపోయాడు. ఈ ఘటనపై హిందూ సంఘాలతోపాటు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముత్యాలమ్మ ఆలయం వద్ద ఆందోళనకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Telangana Liquor Sales: మనోళ్లు మామూలోళ్లు కాదు.. వెయ్యి కోట్ల మందు తాగేశారు..