Medigadda Case : మేడిగడ్డ కేసులో మరో ట్విస్ట్.. కేసీఆర్‌కు మళ్లీ సమన్లు..!

  • మేడిగడ్డ కేసు సెప్టెంబర్ 9కి వాయిదా
  • కేసీఆర్‌కు మరోసారి సమన్లు పంపాలని ఆదేశం
  • పిటిషనర్ మృతితో కేసులో కీలక పరిణామం
  • కోర్టుకు హాజరైన ఎల్‌అండ్‌టీ, హరీశ్‌రావు తరఫు లాయర్లు
Kcr

Kcr

Medigadda Case : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సంచలనం సృష్టిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ కేటగిరీ కేసు విచారణను జిల్లా కోర్టు వచ్చే నెల సెప్టెంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో అసలు పిటిషనర్ రాయలింగమూర్తి మృతి చెందడంతో, విచారణను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రక్రియను కొనసాగించాలని హైకోర్టు సూచించింది. అంతేకాకుండా ఈ వివాదాన్ని జిల్లా కోర్టు పరిధిలోనే పరిష్కరించుకోవాలని ఉన్నత నాయస్థానం స్పష్టం చేసింది. అయితే ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సమన్లు ఇంకా అందకపోవడంతో, ఆయనకు మరొకసారి సమన్లు పంపించాల్సిందిగా జిల్లా న్యాయవాదిని కోర్టు ఆదేశించింది.

తీర్పు కోసం ఎదురుచూపులు.. లాయర్ల హాజరు

నేడు ఈ కేసుపై తుది నిర్ణయం లేదా తీర్పు వెలువడే అవకాశం ఉండటంతో హైదరాబాద్ నుంచి ఎల్‌అండ్‌టీ (L&T) సంస్థ ప్రతినిధులు, అలాగే మాజీ మంత్రి హరీశ్‌రావు తరఫు న్యాయవాదులు ప్రత్యేకంగా జిల్లా కోర్టుకు హాజరయ్యారు. ఉదయం నుంచి తీవ్ర ఉత్కంఠ నెలకొన్నప్పటికీ, న్యాయస్థానం విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో తదుపరి విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.