NTV Telugu Site icon

Water Supply: ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయండి.. జలమండలి ఆదేశం..

Jalamandali Hyderabad

Jalamandali Hyderabad

Water Supply: హైదరాబాద్‌లో భారీ వర్షానికి నగరం నీటమునిగింది. దీంతో జలమండలి అప్రమత్తమైంది. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఈరోజు (మంగళవారం) ఉన్నతాధికారులు, జీఎం, డీజీఎం, మేనేజర్లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. వాటర్‌లాగింగ్ పాయింట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈఆర్‌టీ, ఎస్పీటీ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయని వెల్లడించారు. ముంపు ప్రాంతాల్లో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. సాధ్యమైన ప్రాంతాల్లో క్లోరిన్ బిల్లులు పంపిణీ చేయాలని సూచించారు. కలుషిత నీరు సరఫరా అయ్యే ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. పని చేసే ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాన్‌హోల్స్‌ తెరవవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏమైనా సమస్యలుంటే కస్టమర్ కేర్ నంబర్ 155313కు ఫోన్ చేయాలని సూచించారు.

Read also: Hyderabad Metro: మెట్రోలో ప్రయాణికుల రద్దీ.. ప్రయాణికులతో నిండిపోయిన స్టేషన్లు..

రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని వివరించారు. ఈ సందర్భంగా ఎండీ అశోక్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులు, సిబ్బంది సెలవులను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు హైదరాబాద్‌లో నిన్నటి నుంచి వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు గంటల పాటు నగరవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భాగ్యనగరానికి జీహెచ్‌ఎంసీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా, హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
RTC Rakhi Record: ఆర్టీసీ రాఖీ రికార్డ్.. ఒక్క రోజే 64 లక్షల మంది ప్రయాణం..