Municipal Elections: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రాజకీయ పార్టీలతో సమావేశం, కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన వార్డుల వారీగా తుది ఓటరు జాబితాను విడుదల చేశారు. ఎన్నికలు నిర్వహించే 117 మున్సిపాలిటీలు, ఆరు మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన ఓటర్లు 51,92,220 మంది ఉన్నారు. వీరిలో మహిళలు 25,37,136, పురుషులు 26,54,453, ఇతరులు 631 మంది ఉన్నారు. దీంతోపాటు పోలింగ్ కేంద్రాల వారీగా ముసాయిదా ఓటరు జాబితాను మంగళవారం విడుదల చేయనున్నారు. ఈనెల 16న ఫైనల్ ఓటరు లిస్టును ప్రచురించనున్నారు.
Read Also: Karan Johar : మా అమ్మ నన్ను లావుగా ఉన్నావని అనేది.. బరువు తగ్గడంపై కరణ్ జోహార్ సంచలన వ్యాఖ్యలు.!
మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే 117మున్సిపాలిటీలు, ఆరు మున్సిపల్ కార్పొరేషన్లలో 2011 జనాభా లెక్కల ప్రకారం 57,41,111 మంది ఉన్నారు. వీరిలో ఎస్టీలు 2,46,764 మంది, ఎస్సీల జనాభా 7,75,653 మంది ఉన్నారు. అయితే ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఖరారు చేయనున్నారు. బీసీల రిజర్వేషన్లను మాత్రమే డెడికేషన్ కమిషన్ రిపోర్టు ఆధారంగా ఖరారు చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇక, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో స్టార్ క్యాంపెయినర్ల లిస్టు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేసింది. దీనికి సంబంధించిన లెటర్ ను అన్ని రాజకీయ పార్టీలకు పంపించింది. ఎన్నికల నోటిఫికేషన్ కు ముందుగానే ఎన్నికల ప్రచారంలో పాల్గొనే స్టార్ క్యాంపెయినర్లను లిస్టు అందజేయాలని కోరింది. అయితే స్టార్ క్యాంపెయినర్ కు సంబంధించిన బయోడేటాతో పాటు ఏదైనా ఐడెంటి కార్డుతో కూడిన కాపీని అందజేయాలని కోరింది. దీంతో పాటు స్టార్ క్యాంపెయినర్ వినియోగించే వాహనానికి సంబంధించిన పాస్ కూడా జారీ చేయనున్నారు.
అయితే, రాష్ట్ర ఎన్నికల సంఘంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు 20 మంది, ఎన్నికల సంఘంలో రిజిస్ట్రర్ కాని రాజకీయ పార్టీలకు ఐదు మందికి మాత్రమే అవకాశమున్నట్టు ఎన్నికల సంఘం పేర్కొన్నది. స్టార్ క్యాంపెయినర్‌లకు సంబంధించిన ప్రచారంలో పోటిచేసే అభ్యర్థి ఉన్నా, అభ్యర్థి లేకపోయినా ఆయనకు సంబంధించిన బ్యానర్, పోస్టర్, కరపత్రాలు ఉన్నా ఈ ఖర్చును అభ్యర్థి ఖాతాలో జమచేయనున్నట్టు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.