ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్‌ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. అంతేకాకుండా మోడీ దిష్టిబొమ్మను దహనం చేస్తూ ర్యాలీలు నిర్వహించారు. అయితే దీనిపై స్పందించిన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పోలీసులపై విమర్శలు చేశారు. మోడీ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తుంటే శవయాత్రలు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని, పోలీసులా టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలా అంటూ ఆమె అగ్రహం వ్యక్తం చేశారు.
బీజేపీ ఆందోళనలకు అనుమతి ఇవ్వరు కానీ టీఆర్‌ఎస్ నిరసనలకు రక్షణనిస్తున్నారు.. ఇదెక్కడి న్యాయం డీజీపీ గారూ.. అంటూ ఆమె మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తారు.. టీఆర్‌ఎస్ కార్యక్రమంలో కార్యకర్తల్లా పాల్గొంటారు.. పోలీసుల ద్వంద్వ వైఖరిని ఖండిస్తున్నా అని ఆమె తెలిపారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించండి అంటూ ఆమె హితవు పలికారు.