Cyberabad SHE Teams: మహిళల రక్షణే ధ్యేయం.. సైబరాబాద్ ‘షీ టీమ్స్’ ప్రత్యేక నిఘా-185 డెకాయ్ ఆపరేషన్లు, 28 మంది పట్టివేత

Cyberabad She Teams

Cyberabad She Teams

Cyberabad SHE Teams Action: మహిళలు, యువతుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ సైబరాబాద్ పరిధిలో షీ టీమ్స్ (SHE Teams), యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) విస్తృతంగా చర్యలు చేపట్టాయి. బహిరంగ ప్రదేశాల్లో వేధింపులకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతూ విసృతంగా తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.

డెకాయ్ ఆపరేషన్లతో నిఘా.. 39 పెట్టీ కేసులు

బహిరంగ ప్రదేశాల్లో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించే వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు షీ టీమ్స్ రంగంలోకి దిగాయి. కమిషనరేట్ పరిధిలోని రద్దీ ప్రాంతాల్లో మొత్తం 185 డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించారు.
* ఈ ఆపరేషన్లలో బహిరంగంగా అసభ్య చేష్టలకు పాల్పడుతూ పట్టుబడిన 28 మందిపై చర్యలు తీసుకున్నారు.
* నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 39 పెట్టీ కేసులు నమోదు చేయడంతో పాటు, మిగతా వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు.
* వివిధ మాధ్యమాల (ఫోన్, సోషల్ మీడియా, వాట్సాప్ తదితర) ద్వారా బాధితులైన మహిళల నుంచి వచ్చిన 11 ఫిర్యాదులను స్వీకరించి విచారణ చేపట్టారు.

మానవ అక్రమ రవాణాపై ఉక్కుపాదం.. ఇద్దరు బాధితుల రక్షణ

మహిళలు, పిల్లల అక్రమ రవాణాను అరికట్టేందుకు సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) తీవ్ర నిఘా ఉంచింది.
* పీటా (PITA – Prevention of Immoral Trafficking Act) చట్టం కింద నమోదు చేసిన ఒక కేసులో తనిఖీలు చేపట్టి ఇద్దరు బాధితులకు విముక్తి కల్పించారు.
* ఈ అక్రమ రవాణా రాకెట్‌తో సంబంధం ఉన్న ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

17 కుటుంబాల్లో చిగురించిన ఆశలు: ఫ్యామిలీ కౌన్సెలింగ్

భార్యాభర్తల మధ్య మనస్పర్థలు, కుటుంబ వివాదాల పరిష్కారానికి ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు / CDEW సెంటర్ల ద్వారా ప్రత్యేక చొరవ చూపారు. కుటుంబ కలహాలతో విడిపోయే దశకు చేరుకున్న 17 జంటలకు నిపుణుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి, వారి మధ్య సయోధ్య కుదిర్చి తిరిగి ఒక్కటి చేశారు.

1225 మందికి అవగాహన సదస్సులు.. హెల్ప్‌లైన్లపై ప్రచారం

నేరాల నివారణలో భాగంగా సైబరాబాద్ వ్యాప్తంగా విస్తృత స్థాయి అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో దాదాపు 1,225 మంది పాల్గొన్నారు.

* కీలక అంశాలు: మానవ అక్రమ రవాణా, బాలల అక్రమ రవాణా, ఈవ్‌టీజింగ్, సోషల్ మీడియా వేధింపులు, బాల్య వివాహాలు, బాల కార్మికుల సమస్యలు, స్టాకింగ్, బెగ్గింగ్, సైబర్ బుల్లీయింగ్, సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

* అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు: ఆపద సమయాల్లో సంప్రదించాల్సిన మహిళా హెల్ప్‌లైన్ (181), చైల్డ్ హెల్ప్‌లైన్ (1098), పోలీసు అత్యవసర సహాయం (డయల్ 112), అలాగే సైబర్ నేరాల సమాచారం కోసం (1930) నంబర్లను ఎలా ఉపయోగించుకోవాలో వివరించారు. మహిళలు, చిన్నారులపై వేధింపులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, బాధితులు నిర్భయంగా పోలీసులను ఆశ్రయించాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు.