తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన కూకట్‌పల్లి సహ్రస హత్య కేసు మిస్టరీ వీడింది. హత్య కేసు మిస్టరీని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి వెల్లడించారు. సహస్రను చంపింది పక్కింటి పదో తరగతి బాలుడు అని తెలిపారు. సహస్ర హత్యకు గురైన రోజే తమకు అనుమానం వచ్చి బాలుడిని విచారించామని.. కానీ తనకేమీ తెలియదని అబద్ధం చెప్పాడన్నారు. నాలుగు రోజుల పాటు అనేక మందిని విచారించామని.. అయితే ఓ పిల్లోడు క్లూ ఇచ్చాడని.. హత్య జరిగిన రోజు ఆగస్టు 18న ఉదయం 8:30-8:40 గంటల సమయంలో సహస్ర ఇంటి సమీపంలో నిందితుడు తచ్చాడుతూ కనిపించినట్లుగా పిల్లోడు సమాచారం ఇచ్చాడని.. దీంతో తమ అనుమానం బలపడిందన్నారు. అనంతరం బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడని చెప్పుకొచ్చారు.
గత ఐదేళ్ల నుంచి నిందితుడు సరిగ్గా స్కూల్‌కు వెళ్లడం లేదని.. ఓటీటీలో క్రైమ్ సినిమాలు, మిస్టరీ సీన్లు చూడ్డాం. యూట్యూబ్‌లో క్రైమ్ థిల్లర్ మూవీలు చూడ్డాం అలవాటు చేసుకున్నాడని.. ఎప్పుడూ స్కూల్ ఎగ్గొట్టి క్రికెట్ ఆడుతుంటాడని తెలిపారు. హత్య జరిగిన రోజు నిందితుడి ఇంట్లో తల్లి తప్పు అందరూ ఉన్నారని.. అదే రోజు తల్లి అడిగితే తనకేమీ తెలియదని అబద్ధం చెప్పాడన్నారు. చివరికి తనకేమీ తెలియదని ఒట్టు కూడా వేశాడని ఆమె తెలియజేసినట్లుగా పేర్కొన్నారు. అయితే రెండు నెలల క్రితం చేతిలో మొబైల్ చూసి.. ఇదెక్కడిది అని అడిగితే సమాధానం ఇవ్వలేదని తల్లి చెప్పినట్లుగా పోలీసులు తెలిపారు.
ఇక హత్య చేసిన తర్వాత ఇంటి బయట కత్తి కడిగి.. లోపలికి వెళ్లి ప్యాంట్, టీ షర్ట్‌తోనే స్నానం చేసి అనంతరం ఆ బట్టలను వాషింగ్ మిషన్‌లో వేసేశాడని వివరించారు. అయితే తమకు అనుమానం ఇచ్చి నిందితుడి ఇల్లు తనిఖీ చేయగా ఒక లెటర్ దొరికిందని.. అది ఈ హత్య కోసం కాదని చెప్పారు. ఇక అదే రోజు కుందేల్ కూడా చనిపోయిందని.. దాని స్టోరీ కూడా తమకు చెప్పాడని పేర్కొన్నారు. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లినా కుందేల్ బతకలేదని చెప్పినట్లుగా తెలిపారు. కేవలం సహస్ర తమ్ముడి బ్యాట్ నచ్చడంతో.. దాన్ని దొంగిలించాలని స్కెచ్ వేశాడని.. చోరీ చేస్తుండగా సహస్ర చూడడంతో చంపేశాడని పోలీసులు వివరించారు.