Site icon NTV Telugu

BRS in Bus Protest: పెరిగిన టికెట్ ధరలు.. బస్సెక్కి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన..

Brs

Brs

BRS in Bus Protest: టికెట్ ధరల పెంపుకు వ్యతిరేకంగా ఆర్టీసీ బస్సేక్కి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. నాంపల్లి ఎక్సిబిషన్ గ్రౌండ్ బస్ స్టాప్ నుంచి అసెంబ్లీ బస్ స్టాప్ వరకు బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెంచిన బస్సు ఛార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినట్లే ఇచ్చి, పురుషుల నుంచి డబుల్ ఛార్జీ వాసులు చేస్తున్నారు అని ఆరోపించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పాల్గొన్నారు.

Read Also: Samantha: అది నా రెండో ఇల్లు.. అక్కడికి వెళ్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది

ఇక, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు పెంచి సామాన్యుడిపై పెను భారం మోపిందన్నారు. ఒక్కో టికెట్ మీద రూ. 10 పెంచి నెలకు రూ. 5 నుంచి 600 రూపాయల భారాన్ని మోపింది.. ప్రభుత్వం రాక ముందు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఈరోజు అన్ని రకాల ధరలు పెంచి సామాన్యుడిపై భారం మోపుతున్నాడు.. ఇవాళ ఆర్టీసీ బస్ ఛార్జీలు, మొన్న వాహనాల రిజిస్ట్రేషన్ ఛార్జీలు, అంతకుముందు మద్యం చార్జీలను పెంచాడని ఆరోపించారు. ఈ విధంగా అన్ని ఛార్జీలను పెంచి సామాన్యుల జీవితాన్ని నరకంగా మారేటట్టు చేస్తున్నారు.. వెంటనే ఆర్టీసీ ఛార్జీలను తగ్గించి సామాన్యుడిపై భారం తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం.. ఒకవైపు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అంటునే, మరోవైపు మగవారి దగ్గర నుంచి బస్సు చార్జీలు పెంచి రెండింటిని సమానం చేశాడు.. సామాన్య ప్రజలకు ఊరట కలిగించాలంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాల్సిందేనని సుధీర్ రెడ్డి పేర్కొన్నారు.

Read Also: Congress Meeting: నేడు సీఎం రేవంత్ తో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మీనాక్షి నటరాజన్ భేటీ..

ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజానీకంపై పెద్ద ఎత్తున బండరాయి వేసినట్టు అయింది అని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సామాన్య ప్రజలు ఎక్కడికి వెళ్లాలన్నా ఆర్టీసీ బస్సులను సంప్రదిస్తారు.. అలాంటిది బస్సుల్లో విపరీతమైన ఛార్జీలు పెంచారు.. వాళ్ల జేబులు ఖాళీ చేసే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం.. పూర్తిగా డీజిల్ ఛార్జీలు తగ్గినా కూడా పెద్ద ఎత్తున ఆర్టీసీ ధరలను పెంచడం ఘోరం.. రూ. 100 కోట్ల ఆదాయం వచ్చే కార్గో ను కూడా వేరే కంపెనీకి ఇచ్చి కేవలం రూ. 36 కోట్లకే దిగజార్చారని ఆరోపణలు చేశారు. అదే ఆదాయం ప్రభుత్వం చేపట్టి పేద ప్రజలపై భారం పడకుండా చూసుంటే బాగుండేది అన్నారు. ఇంత పెద్ద మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీయాలని కోరారు. వచ్చే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుతుందని వెల్లడించారు.

Exit mobile version