VC Sajjanar : కొత్తగా నియమితులైన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ VC సజ్జనార్ తన ప్రాధాన్యతలు, విధానాలను స్పష్టంగా వెల్లడించారు. ఎన్ టివి తో మాట్లాడిన ఆయన, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ లో రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సజ్జనార్ మాట్లాడుతూ.. “నేను ఎప్పటిలాగే నా పంథాలోనే ముందుకు వెళ్తాను. నగరంలో చట్టసువ్యవస్థ పరిరక్షణ కోసం పూర్తిస్థాయిలో కృషి చేస్తాను. ముఖ్యంగా సైబర్ నేరాలు, ఆర్థిక నేరాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారిస్తాం,” అని తెలిపారు.
అదే సమయంలో రౌడీషీటర్లపై గట్టి చర్యలు తప్పవని హెచ్చరించారు. “హైదరాబాద్ లో ఎవరైనా రౌడీషీటర్లు హల్చల్ చేస్తే వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తాం. చట్టం అందరికీ సమానమే,” అని ఆయన చెప్పారు. సోషల్ మీడియా విషయంలో కూడా కొత్త కమిషనర్ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. “సోషల్ మీడియాలో అనర్ధాలకు దారితీసే పోస్టులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా రాజకీయ నాయకులు, వారి అనుచరులు కూడా ఇలాంటి ప్రవర్తనకు పాల్పడకూడదు. ఎక్కడో జరిగిన సంఘటనను వక్రీకరించి పోస్టులు పెడితే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది,” అని ఆయన హెచ్చరించారు.
ట్రాఫిక్ నియంత్రణపై మాట్లాడుతూ సజ్జనార్, ఇది నగరానికి ఒక పెద్ద సవాల్ అని అన్నారు. “హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తాం. ఫ్రీ ఫ్లో కోసం అన్ని ప్రయత్నాలు చేస్తాం,” అని తెలిపారు. హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన VC సజ్జనార్, ముందుచూపుతో, కఠిన నిర్ణయాలతో నగరంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్న హామీ ఇచ్చారు.