Ameerpet Fire Accident : అమీర్‌పేట్ అగ్నిప్రమాదం నేపథ్యంలో మెట్రో పిల్లర్‌కు పగుళ్లు (క్రాక్స్) వచ్చాయంటూ సోషల్ మీడియా, కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న వార్తలపై హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు స్పందించారు. ఈ వార్తలను వారు పూర్తిగా ఖండించారు. మెట్రో పిల్లర్‌కు ఎలాంటి నష్టం వాటిల్లలేదని, ప్రయాణికులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అగ్నిప్రమాదం జరిగిన వ్యాపార సముదాయానికి మెట్రో పిల్లర్ చాలా దగ్గరగా ఉంది. ఈ ప్రమాదం కారణంగా పిల్లర్‌కు ఏమైనా నష్టం జరిగిందా అని నిర్ధారించుకోవడానికి మాత్రమే ముందస్తు జాగ్రత్తగా నిపుణులతో తనిఖీలు చేయించామన్నారు.
ప్రకటన బోర్డు కాలి.. దాని లిక్విడ్ పిల్లర్‌పై పడింది..
ఈ తనిఖీల్లో మెట్రో పిల్లర్ నిర్మాణానికి ఎలాంటి డ్యామేజీ జరగలేదని, అది పూర్తిగా సురక్షితంగానే ఉందని తేలింది. (Ameerpet Fire Accident) పిల్లర్ పై ఉన్న ఒక ప్రకటన బోర్డు (Ad Board) మంటలకు కాలిపోవడంతో, దానికి సంబంధించిన కెమికల్ లిక్విడ్ కారుతూ వచ్చి మెట్రో పిల్లర్‌పై పడింది. ఆ లిక్విడ్ మరకల వల్ల పిల్లర్‌పై పగుళ్లు వచ్చినట్లు బయటకు కనిపించిందే తప్ప, వాస్తవానికి పిల్లర్‌కు ఎలాంటి క్రాక్స్ రాలేదని అధికారులు వివరణ ఇచ్చారు. మెట్రో సర్వీసులు ఎప్పటిలాగే పూర్తి సురక్షితంగా నడుస్తాయని, పుకార్లను నమ్మవద్దని మెట్రో అధికారులు కోరారు.
