NTV Telugu Site icon

Hyderabad: దేశంలోనే అత్యంత సేఫ్ సిటీగా మూడో స్థానంలో హైదరాబాద్

Hyderabad

Hyderabad

Hyderabad:  దేశంలోని అన్ని మెట్రో నగరాలలో భద్రత గురించి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికలో హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా నగరం దేశంలోనే సేఫ్ సిటీగా నిలిచింది. ఈ జాబితాలో రెండో స్థానంలో మహారాష్ట్రలోని పుణే ఉంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం 2021లో హైదరాబాద్ నగరంలో మొత్తం 2,599 నేరాలు నమోదయ్యాయి. కోల్‌కతా 1,034 నేరాలతో అతి తక్కువ నేరాలు జరిగే మెట్రో నగరంగా అగ్రస్థానంలో నిలిచింది. 2,568 నేరాలతో పుణే రెండో స్థానంలో ఉంది. అయితే దేశ రాజధాని ఢిల్లీ ఈ జాబితాలో అట్టడుగున నిలవడం గమనించాల్సిన విషయం.

ఢిల్లీలో ప్రతి 10 లక్షల జనాభాకు 18,596 నేరాలు జరుగుతున్నాయి. దీంతో దేశంలో అత్యధిక నేరాల రేటును ఢిల్లీ కలిగి ఉంది. సూరత్, కొచ్చిన్, అహ్మదాబాద్, చెన్నై నగరాలు అత్యధిక నేరాల రేటు గల మెట్రో నగరాల జాబితాలో ఉన్నాయి. హైదరాబాద్ పొరుగున ఉండే కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రతి మిలియన్ జనాభాకు 4,272 నేరాలు జరుగుతున్నాయి. దేశంలో సురక్షితమైన నగరాల్లో బెంగళూరు ఐదో స్థానంలో ఉంది. లక్ష జనాభాను పరిగణనలోకి తీసుకుంటే కోల్‌కతాలో 104.4, పూణేలో 256.8, హైదరాబాద్‌లో 259.9 నేరాలు నమోదయ్యాయి. బెంగళూరులో 427.2 నేరాలు, ముంబైలో 428.4 నేరాలు జరుగుతున్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది.

Read Also: Supreme Court: టీవీ ఛానళ్లలో విద్వేష ప్రసంగాలపై సుప్రీం సీరియస్‌.. యాంకర్లదే బాధ్యత..!

గత ఏడాది కోల్‌కతాలో 45, హైదరాబాద్‌లో 98, బెంగళూరులో 152, దిల్లీలో 454, ముంబైలో 162 హత్య కేసులు నమోదైనట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తన నివేదికలో పేర్కొంది . హత్యాయత్నాలకు సంబంధించి కోల్‌కతాలో 135, హైదరాబాద్‌లో 192, బెంగళూరులో 371, దిల్లీలో 752, ముంబైలో 349 కేసులు నమోదయ్యాయి. అటు అత్యాచార కేసులకు సంబంధించి కోల్‌కతాలో 11, హైదరాబాద్‌లో 116, బెంగళూరులో 117, ఢిల్లీలో 1,226, ముంబైలో 364 కేసులు నమోదయ్యాయి. మహిళలపై దాడులకు సంబంధించి కోల్‌కతాలో 127, హైదరాబాద్‌లో 177, బెంగళూరులో 357, ఢిల్లీలో 1,023 కేసులు నమోదయ్యాయి.