హైదరాబాద్ శివారు సంగారెడ్డి జిల్లా కంది ఐఐటీలో ఎంటెక్ విద్యార్థి రాహుల్ అనుమానాస్పద మృతి అతని కుటుంబీకులను షాక్ కి గురిచేసింది. రాహుల్ ఆత్మహత్య వార్త తెలుసుకుని సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రి మార్చురీ దగ్గరకు చేరుకున్నారు రాహుల్ తండ్రి మధుసూదన్ రావు, పెద్ద నాన్న రమేష్ బాబు. ఈ ఘటనను తలుచుకుని వారు కన్నీరుమున్నీరవుతున్నారు. ఐఐటీ హైదరాబాద్ వాహనంలో మార్చురీ దగ్గరకు తీసుకువచ్చారు అధికారులు. తన కొడుకు చనిపోయిన సమాచారం తనకి తెలియదంటున్నారు తండ్రి మధుసూదన్ రావు.
కొడుకు డిప్రెషన్ లోకి వెళ్లాడని..మీరు రావాలని ఐఐటీ హైదరాబాద్ అధికారులు ఫోన్ చేశారని చెబుతున్నారు తండ్రి. ఇక్కడికి వచ్చిన తరువాత అసలు విషయం అధికారులు తనకు చెప్పారని రాహుల్ తండ్రి తెలిపారు. ఈవిషయం తెలియడంతో భోరున విలపిస్తున్నారు తండ్రి, పెదనాన్న. రాహుల్ చాలా యాక్టీవ్ గా ఉండేవాడని చెబుతున్నారు తండ్రి మధుసూదన్ రావు. ఈనెల ఆగస్ట్ 27న బర్త్ డే సెలెబ్రెట్ చేసుకున్న రాహుల్.. చాలా సంతోషంగా వున్నాడని, ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని విషాదంలో మునిగిపోయారు రాహుల్ తండ్రి మధుసూదన్ రావు. అంతేకాకుండా రాహుల్ చనిపోయిన విషయం అతని తల్లికి తెలియదంటున్నారు తండ్రి మధుసూదన్ రావు. సంగారెడ్డి పోలీస్ స్టేషన్ లో పోలీసులు తమకు విషయం తెలియచేశారన్నారు. వాళ్ల అమ్మకు ఏం చెప్పాలో తెలియడం లేదని కన్నీటి పర్యంతం అవుతున్నారు. అమ్మాయి ఇంజనీరింగ్ ఫైనలియర్ చదువుతోందని, రాహుల్ విషయం చెబితే వాళ్ళ పరిస్థితి ఎలా వుంటుందో అర్థం కావడం లేదన్నారు ఎన్టీవీతో మధుసూదన్ రావు.
Read Also: Hyderabad IIT Student Incident: కంది ఐఐటీలో విద్యార్థి అనుమానాస్పద మృతి
కంది మండలకేంద్రం గల ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో ఎంటెక్ చదువుతున్న రాహుల్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఐఐటీ ఈ బ్లాక్‌లోని 107 నెంబర్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతనిది ఏపీలోని నంద్యాల జిల్లా. ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.