Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!

  • బంగాళాఖాతం అల్పపీడనంతో హైదరాబాద్‌లో భారీ వర్షం
  • ప్రధాన రహదారులు జలమయం.. గణేష్ మండపాల్లోకి నీరు
  • సాయంత్రం వేళ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం
  • విద్యుత్ తీగలు, పోల్స్ వద్ద జాగ్రత్తగా ఉండాలని సూచన
Rains

Rains

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భాగ్యనగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. సాయంత్రం వేళ ఒక్కసారిగా వాతావరణం మారిపోయి, బలమైన ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షం ప్రారంభమైంది. గాలివానతో మొదలైన వాన కొద్దిసేపట్లోనే తీవ్రరూపం దాల్చడంతో నగరంలోని పలు కీలక ప్రాంతాలు నీట మునిగాయి. బంగాళాఖాతంలో నెలకొన్న వాతావరణ మార్పుల వల్లే ఈ వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

జలమయమైన ప్రధాన రహదారులు.. గణేష్ మండపాల్లోకి నీరు

వర్ష తీవ్రతకు నగరంలోని ఐటీ కారిడార్ సహా ప్రధాన నివాస, వ్యాపార ప్రాంతాలు జలమయమయ్యాయి. బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, జూబ్లీహిల్స్, మెహిదీపట్నం, అమీర్‌పేట్, కూకట్‌పల్లి, మాదాపూర్, బాలానగర్, మియాపూర్ లలో రహదారులపై నీరు నిలిచిపోయింది. అలాగే నగర తూర్పు భాగాన ఉన్న ఉప్పల్, లక్డీకాపూల్, మలక్‌పేట్, దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, ఎల్.బి.నగర్, హయత్‌నగర్ ప్రాంతాల్లో కూడా కుండపోత వాన కురిసింది. గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న వేళ, పలు ప్రాంతాల్లోని వినాయక మండపాల్లోకి వర్షపు నీరు చేరడంతో నిర్వాహకులు, భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

స్తంభించిన ట్రాఫిక్.. హెచ్చరికలు జారీ చేసిన అధికారులు

సాయంత్రం వేళ కార్యాలయాల నుంచి ఇళ్లకు తిరిగి వెళ్లే సమయంలో వర్షం పడటంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. పలు మార్గాల్లో ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణం దుర్భరంగా మారింది. ఈ పరిస్థితుల దృష్ట్యా రోడ్లపైకి వచ్చేవారు తగిన జాగ్రత్తలు పాటించాలని మున్సిపల్, పోలీసు అధికారులు విజ్ఞప్తి చేశారు. వర్షం కారణంగా ప్రమాదాలు జరగకుండా విద్యుత్ తీగలు, పోల్స్ వద్ద అత్యంత జాగ్రత్తగా ఉండాలని, బాటసారులు , వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు స్పష్టం చేశారు.