Hyderabad Water Supply: హైదరాబాద్‌కు గోదావరి నీళ్లు.. మరో రెండు రోజుల్లో కీలక పనులు పూర్తి

  • గోదావరి జలాల తరలింపునకు ఏర్పాట్లు
  • రెండు రోజుల్లో పైప్‌లైన్ అనుసంధానం
  • రాతి పొరలతో పనుల్లో జాప్యం
  • రోజుకు 40 ఎంజీడీల అదనపు నీరు  
Hyd Water

Hyd Water

హైదరాబాద్ మహానగరానికి తాగునీటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు జలమండలి ముమ్మరంగా చర్యలు చేపట్టింది. సింగూరు, మంజీరా జలాలకు ప్రత్యామ్నాయంగా గోదావరి అదనపు జలాలను తరలించే పనులు తుది దశకు చేరుకున్నాయి. మల్లన్నసాగర్ నుంచి ఘన్‌పూర్ మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వరకు 1600 మి.మీ. వ్యాసం గల మిషన్ భగీరథ, జలమండలి పైప్‌లైన్ అనుసంధాన పనులను రెండు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. శుక్రవారం జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, మిషన్ భగీరథ ఇంజినీర్ ఇన్ చీఫ్ కృపాకర్ రెడ్డి కలిసి ఈ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పురోగతిపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసి ట్రయల్ రన్‌కు సిద్ధం కావాలని ఆదేశించారు.

రాతి పొరలతో జాప్యం.. ఘన్‌పూర్‌లో సిద్ధమైన జంక్షన్

ఈ పనులను తొలుత ఈ నెల 15 నాటికే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే అటవీ ప్రాంతంలోని 150 మీటర్ల పైప్‌లైన్ మార్గంలో భారీ రాతి పొరలను తొలగించాల్సి రావడంతో కొంత ఆలస్యం జరిగింది. ఇప్పుడు మిగిలిన పనులను వేగంగా చేపడుతున్నామని, రెండు రోజుల్లో అన్ని పనులు పూర్తి చేసి ట్రయల్ రన్‌కు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు ఘన్‌పూర్ ఎంబీఆర్ వద్ద జలమండలి చేపట్టిన పైప్‌లైన్ జంక్షన్ పనులు పూర్తయి వినియోగానికి సిద్ధంగా ఉన్నాయి. మిషన్ భగీరథ పైప్‌లైన్ అనుసంధానం కాగానే ట్రయల్ రన్ మొదలుపెట్టనున్నారు.

సింగూరు–మంజీరా లోటు భర్తీకి ముందస్తు అడుగు

ఎల్‌నినో ప్రభావంతో సింగూరు, మంజీరా జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో జలమండలి ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. రోజుకు 40 ఎంజీడీల అదనపు గోదావరి జలాలను నగరానికి తీసుకురావాలని ప్రణాళిక రూపొందించారు. సింగూరు, మంజీరా నీటిపై ఆధారపడిన ప్రాంతాలకు ఎదురయ్యే లోటులో సుమారు 50 శాతాన్ని ఈ గోదావరి జలాలతో భర్తీ చేయనున్నారు. మిషన్ భగీరథ, జలమండలి అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సాంకేతిక పనులను పూర్తి చేసి ట్రయల్ రన్‌కు ఏర్పాట్లు చేయాలని ఎండీ అశోక్ రెడ్డి సూచించారు.