NTV Telugu Site icon

Hyderabad: హైదరాబాద్‌ను 3 ‘జిల్లాలు’ చేయనున్న కాంగ్రెస్‌ పార్టీ

Hyd Congress

Hyd Congress

కాంగ్రెస్‌ పార్టీ గ్రేటర్‌ హైదరాబాద్‌తోపాటు సిటీ చుట్టుపక్కల ఉన్న సబర్బన్‌ ప్రాంతాల్లోని అసెంబ్లీ సెగ్మెంట్లపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. ఈ ఏరియాల్లో బీజేపీకి చెక్‌ పెట్టడంతోపాటు పార్టీకి పునర్వైభవం తేవటమే లక్ష్యంగా పెట్టుకుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో మొత్తం 24 శాసన సభ నియోజకవర్గాలు ఉండగా 2018 ఎన్నికల్లో కనీసం ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది. 2020లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎలక్షన్లలో సైతం 150 వార్డులకు గాను నామమాత్రంగా రెండు చోట్లే నెగ్గింది. మూడో వార్డును ఉపఎన్నికలో దక్కించుకుంది.

సికింద్రాబాద్‌ లోక్‌సభ ఎంపీ సీటును 2004, 2009ల్లో వరుసగా రెండు సార్లు కైవసం చేసుకున్న హస్తం పార్టీ ఆ తర్వాత వరుసగా రెండు సార్లు (2014, 2019ల్లో) ఓడిపోయింది. 2019లో అయితే మరీ మూడో స్థానానికి పరిమితమైంది. ఈ రెండు సార్లూ ఇక్కడ బీజేపీనే విజయం సాధించింది. ఇక హైదరాబాద్‌ లోక్‌సభ స్థానానికి వస్తే అక్కడ గత నాలుగు దశాబ్దాల నుంచి కంటిన్యూగా ఎంఐఎమ్మే విక్టరీ కొడుతోంది. ఈ నేపథ్యంలో పార్టీని తిరిగి ఫామ్‌లోకి తీసుకొచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వం హైదరాబాద్‌ జిల్లాను మూడు రాజకీయ జిల్లాలుగా విభజించనుంది. 1. హైదరాబాద్‌ 2. ఖైరతాబాద్‌ 3. సికింద్రాబాద్‌.

గ్రేటర్‌ హైదరాబాద్‌ కాకుండా కేవలం హైదరాబాద్‌ జిల్లాలోనే 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దీంతో ఒక్కో జిల్లా కిందికి 5 అసెంబ్లీ సెగ్మెంట్లు రానున్నాయి. అలాగే.. రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలను సైతం చిన్న చిన్న యూనిట్లుగా డివైడ్‌ చేయాలనే ప్రతిపాదన ఉంది. హైదరాబాద్‌ను మూడు పొలిటికల్‌ డిస్ట్రిక్ట్‌లుగా విభజించేందుకు తెలంగాణ లీడర్‌షిప్‌ పార్టీ హైకమాండ్‌ నుంచి రీసెంట్‌గా అనుమతి పొందిందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఈ మూడు రాజకీయ జిల్లాలకు ముగ్గురు అధ్యక్షులను నియమించనున్నారు.

తద్వారా పార్టీని బలోపేతం చేయటంపై మరింత ఎక్కువ దృష్టి పెట్టడానికి వీలుంటుందని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోట అయిన హైదరాబాద్‌ జిల్లాలో మళ్లీ ఆ స్థాయిలో చక్రం తిప్పేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. పార్టీ అగ్ర నేతలు రాహుల్‌ గాంధీతో గానీ లేక ఆయన సోదరి ప్రియాంకా గాంధీతో గానీ భారీ బహిరంగ సభ పెట్టాలని చూస్తోంది. బల్దియా ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా భారీగా పుంజుకున్న సంగతి తెలిసిందే.

దీంతో ఆ పార్టీ మొన్నీమధ్య రంగారెడ్డి జిల్లా శివారు ప్రాంతమైన తుక్కుగూడలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పబ్లిక్‌ మీటింగ్‌ పెట్టింది. పది రోజుల కిందట పరేడ్‌ మైదానంలో ప్రధాని మోడీతోనూ భారీ బహిరంగ సభ నిర్వహించింది. రెండు రోజుల పాటు జాతీయ కార్యవర్గ సమావేశాలను విజయవంతంగా పూర్తిచేసింది. దీంతో కాంగ్రెస్‌ పార్టీ సైతం ఇదే స్థాయిలో కార్యక్రమాల నిర్వహణకు సన్నద్ధమవుతోంది.