Hyderabad Census : హైదరాబాద్‌లో ఇంటింటికీ సర్వే.. మీ ఇంటికీ వస్తున్నారు జాగ్రత్త..!

  • నేటి నుంచే జీహెచ్‌ఎంసీ హౌజ్ లిస్టింగ్ ప్రారంభం
  • 21 వేల మందితో భారీ సర్వే ఆపరేషన్
  • మీ డేటా సేఫ్.. జీహెచ్‌ఎంసీ కీలక హామీ
  • కేవలం 10 నిమిషాల్లో పూర్తయ్యే జనగణన ప్రక్రియ
Census

Census

GHMC: భాగ్యనగరంలో జనగణన (సెన్సస్) ప్రక్రియలో అత్యంత కీలకమైన హౌజ్ లిస్టింగ్ ఆపరేషన్స్ నేటి నుండి అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ భారీ కార్యక్రమంపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కీలక వివరాలను వెల్లడించారు. నగరవ్యాప్తంగా ప్రతి ఇంటిని సందర్శించి వివరాలు సేకరించే ఈ ప్రక్రియ నేటి నుంచి జూన్ 9వ తేదీ వరకు నిరంతరాయంగా కొనసాగనుంది. నగర అభివృద్ధిలో ఈ గణాంకాలు ఎంతో కీలకమని, అందుకే ప్రతి భవనాన్ని ఈ సర్వేలో భాగం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఈ సర్వే కోసం ప్రభుత్వం పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది. మొత్తం 19,868 హౌజ్ లిస్టింగ్ బ్లాక్‌లను గుర్తించి, వాటిలో వివరాలు సేకరించడానికి 21,773 మంది ఎన్యూమరేటర్లను, వారికి మార్గనిర్దేశం చేసేందుకు 3,400 మంది సూపర్వైజర్లను రంగంలోకి దించారు. ప్రతి ఎన్యూమరేటర్ తమకు కేటాయించిన లేఅవుట్ మ్యాప్ ద్వారా సుమారు 200 నుంచి 300 ఇళ్లను సందర్శించాల్సి ఉంటుంది. సర్వేకు వచ్చే సిబ్బంది తప్పనిసరిగా తమ గుర్తింపు కార్డులతో (ID Cards) వస్తారని, జూన్ ఒకటో తేదీ నాటికి నగరంలో అత్యధిక శాతం సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కమిషనర్ వివరించారు.

ప్రజల నుంచి సేకరించే సమాచారం విషయంలో ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కమిషనర్ ఆర్వీ కర్ణన్ భరోసా ఇచ్చారు. ఎన్యూమరేటర్లు సేకరించే డేటాను కేవలం ప్రభుత్వ అవసరాల కోసం మాత్రమే ఉపయోగిస్తామని, దీనిని ఇతరులకు షేర్ చేయడానికి వీలు లేదని స్పష్టం చేశారు. చివరికి సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా గానీ, కోర్టులకు గానీ ఈ డేటాను అందించబోమని ఆయన హామీ ఇచ్చారు. ఈ సర్వే ప్రక్రియ అంతా ‘ఎన్యూమరేట్ మొబైల్ యాప్’ ద్వారా డిజిటల్ పద్ధతిలో జరుగుతుంది. కుటుంబంలో ఎవరైనా ఒక్కరు అందుబాటులో ఉన్నా ఈ వివరాలు అందించవచ్చని, ఒకవేళ ఇంటికి తాళం వేసి ఉంటే ఎన్యూమరేటర్లు మరోసారి వచ్చి వివరాలు సేకరిస్తారని ఆయన తెలిపారు.

ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ సర్వేను అత్యంత సులభంగా నిర్వహించేలా రూపొందించారు. ఇందులో కేవలం 33 ప్రశ్నలు మాత్రమే ఉంటాయని, ఒక్కో ఇంటి వివరాల నమోదుకు సుమారు 10 నిమిషాల సమయం మాత్రమే పడుతుందని కమిషనర్ వెల్లడించారు. కుటుంబ యజమాని పేరు, ఫోన్ నెంబర్ వంటి ప్రాథమిక వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలని, అనవసరమైన ఇతర వివరాలేవీ అడగబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ సర్వే కేవలం నివాస గృహాలకే పరిమితం కాకుండా కమర్షియల్ భవనాలు, హాస్పిటల్స్, హోటళ్లు, అనాథాశ్రమాలు , కాలేజీ హాస్టళ్లను కూడా కవర్ చేయనుంది. జనగణన నిబంధనల ప్రకారం “ఒక కిచెన్‌ను ఒక ఫ్యామిలీ”గా పరిగణిస్తూ అధికారులు ముందుకు సాగుతున్నారు. ఇప్పటివరకు నగరంలో కేవలం 1.27 లక్షల మంది మాత్రమే సెల్ఫ్ ఎన్యూమరేషన్ పూర్తి చేసుకున్నారని, మిగిలిన వారందరూ ఎన్యూమరేటర్లకు సహకరించి ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.