NTV Telugu Site icon

అతిభారీ వర్షాలు.. హైదరాబాద్‌, సైబరాబాద్‌ సీపీల కీలక సూచనలు

గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్‌తో హైదరాబాద్‌తో తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. హైదరాబాద్‌లో ఇవాళ ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది.. ఇక, సాయంత్రం నుంచి కుండపోత వర్షం కురుస్తున్న నేపథ్యంలో.. హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్లు కీలక సూచనలు చేశారు.. సైబరాబాద్ కమీషనరేట్‌లో సిబ్బందిని అలర్ట్ చేసినట్టు తెలిపారు సీపీ స్టీఫెన్ రవీంద్ర.. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన సీపీ.. మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు, సిబ్బందికి ఆదేశాలిచ్చారు. విద్యుత్‌ సమస్యలు వస్తే కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు.. 9490617100, 8331013206, 040-278534183, 040-27853412, టోల్‌ఫ్రీ నెంబర్‌ 1912 నంబర్లకు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని.. పోలీసుల సహాయం కోసం డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు సీపీ స్టీఫెన్ రవీంద్ర.

మరోవైపు.. భారీ వర్షాలపై హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్ అంజనీకుమార్.. పోలీస్‌ అధికారులు, సిబ్బందితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో సిటీ ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. ఎలాంటి సమస్య వచ్చినా 100 నంబర్‌కు డయల్ చేయాలని సూచించారు. పెట్రోలింగ్, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. నగరంలోని లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు సీపీ అంజనీకుమార్.