ప్రముఖ పండుగలు, వేడుకల వేళ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ రాయుళ్ల బాగోతం బట్టబయలైంది. భాగ్యనగరంలో ప్రజలు ఎంతో ఇష్టంగా తినే కోవా, స్వీట్ల తయారీ కేంద్రాలు అత్యంత అపరిశుభ్రంగా, రోత పుట్టించే వాతావరణంలో నడుస్తున్నట్లు ఆహార భద్రతా విభాగం తనిఖీల్లో వెల్లడైంది. తెలంగాణ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ అథారిటీ (TG SAFE) ఎన్ఫోర్స్మెంట్ వింగ్కు చెందిన అధికారులు, పోలీస్ సిబ్బందితో కూడిన ఏడు ప్రత్యేక బృందాలు నగరంలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో ఆకస్మిక దాడులు నిర్వహించి ఈ భారీ కల్తీ దందాను రట్టు చేశాయి.
జీడిమెట్లలోని భాగ్యలక్ష్మి స్వీట్స్ అండ్ బర్ఫీ, బాలాజీ మ్యాజిక్ మిఠాయి, యశోద డెయిరీలతో పాటు కీసర మండలం చీర్యాలలోని మధుర డెయిరీ ప్రొడక్ట్స్, జల్పల్లిలోని దేశీ డెయిరీ స్వీట్స్, పీర్జాదిగూడలోని జగన్నాథ్ మిల్క్ డెయిరీ, శాలిబండ బేలాలోని శంకర్ యాదవ్ కోవా అండ్ పన్నీర్ మర్చంట్లలో అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అధికారులు నివ్వెరపోయే విజువల్స్ బయటపడ్డాయి. ఆహార వ్యర్థాలు నేలపై పడి కుళ్లిపోతుండగా, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక మురుగునీరు నిల్వ ఉంది. కిచెన్లలో గోడలు బూజుపట్టి ఉండగా, స్వీట్లపై ఈగలు ముసురుకోవడం, ఎలుకలు స్వేచ్ఛగా సంచరించడం కనిపించింది. అంతా ప్రమాదకరమైన వాతావరణంలో తినుబండారాలు తయారు చేస్తుండగా, అక్కడే గుట్కా, పాన్ మసాలా ప్యాకెట్లు పడి ఉండటం, కార్మికులు అక్కడక్కడే ఉమ్మేసిన మరకలు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించాయి. సిబ్బంది కనీసం హెయిర్నెట్లు, గ్లౌజులు, ఆప్రాన్లు కూడా ధరించకుండానే స్వీట్లు తయారు చేస్తున్నట్లు గుర్తించారు.
ఈ సోదాల్లో సుమారు రూ. 3,78,178 విలువ చేసే 2,480 కిలోల కల్తీ కోవా, లడ్డూలు తదితర ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకుని అక్కడికక్కడే ధ్వంసం చేశారు. అలాగే కల్తీపై అనుమానంతో మొత్తం 8 నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు తరలించారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించిన కేంద్రాలపై అధికారులు కొరడా రుళిపించారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) లైసెన్స్ లేకుండా, అత్యంత అపరిశుభ్రంగా నిర్వహిస్తున్న చీర్యాలలోని మధుర డెయిరీ ప్రొడక్ట్స్, జల్పల్లిలోని దేశీ డెయిరీ స్వీట్స్లను తక్షణమే మూసివేయాలని ఆదేశించారు. మధుర డెయిరీ, దేశీ డెయిరీతో పాటు జగన్నాథ్ మిల్క్ డెయిరీకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తీవ్రమైన ఉల్లంఘనలు బయటపడటంతో జీడిమెట్లలోని భాగ్యలక్ష్మి స్వీట్స్, బాలాజీ మ్యాజిక్ మిఠాయి, యశోద డెయిరీల ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సులను సస్పెండ్ చేస్తూ తక్షణమే ఉత్పత్తిని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ప్రాణాలతో ఆటలాడితే ఎలాంటి ఉపేక్ష ఉండబోదని, నిబంధనలు పాటించని తయారీదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆహార భద్రతా విభాగం హెచ్చరించింది.

