High Court: హైకోర్టు తాజాగా ఇచ్చిన 222 పేజీల తీర్పు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) పనితీరుపై తీవ్ర ఆక్షేపణలు చేసింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణలో పారదర్శకత లోపించిందని కోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే రెండుసార్లు గ్రూప్-1 పరీక్షలు రద్దయినా, టీజీపీఎస్సీ తన పనితీరులో మార్పు తీసుకురాలేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉండగా, మళ్లీ నిర్లక్ష్యంతో ముందుకు సాగిందని కోర్టు విమర్శించింది.
తీర్పులో కోర్టు ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థుల సమస్యను ప్రస్తావించింది. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులలో 89.9% మంది సెలెక్ట్ అవ్వగా, తెలుగు మీడియం అభ్యర్థులలో కేవలం 9.95% మాత్రమే ఎంపిక కావడం తీవ్రమైన అసమానత అని పేర్కొంది. “తెలుగు మీడియం విద్యార్థులు బాగా రాయలేదనే నమ్మకం లేకపోతే రీవాల్యుయేషన్ ఎందుకు అడుగుతున్నారు?” అని కోర్టు ప్రశ్నించింది. ఆన్సర్ షీట్ల మూల్యాంకనంలో సరైన విధానాన్ని పాటించలేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ అంశంపై టీజీపీఎస్సీ ఇచ్చిన సమాధానంపైనా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
అంతేకాకుండా, “ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC)లో గ్రూప్-1 నియామకం మూడు దశల్లో జరుగుతుంది – ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. కానీ తెలంగాణలో మాత్రం కేవలం ప్రిలిమ్స్, మెయిన్స్ మాత్రమే ఉన్నాయి” అని కోర్టు వ్యాఖ్యానించింది. అలాగే, రెండు సెంటర్లలో పరీక్ష రాసిన 71 మంది మహిళా అభ్యర్థులు ఎంపిక కావడం ఎలా సాధ్యమైందని కోర్టు ప్రశ్నించింది. ఈ అంశంలో కూడా టీజీపీఎస్సీ నిర్లక్ష్యం స్పష్టమైందని పేర్కొంది. “రోజుకు 12 గంటలు కోచింగ్ సెంటర్లలో శ్రమిస్తున్న యువతను టీజీపీఎస్సీ నిర్లక్ష్యం తీవ్రంగా నష్టపరిచింది” అని హైకోర్టు వ్యాఖ్యానించింది. నిరుద్యోగుల భవిష్యత్తు ప్రమాదంలో పడేలా పరీక్షలను నిర్వహించకూడదని కోర్టు స్పష్టం చేసింది.