హైదరాబాద్‌లో భారీ వర్షం దంచికొడుతోంది. నగరంలో కుండపోతగా వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మరోవైపు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం నగరంలో మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. దీంతో ఒక్కసారిగా భారీగా వర్షం కురిసింది.
జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, బంజారాహిల్స్, లింగంపల్లి, తెల్లాపూర్, అమీర్‌పేట, ఖైరతాబాద్, యూసఫ్‌గూడ, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, బోయిన్‌పల్లి, అల్వాల్, సికింద్రాబాద్, పటాన్‌చెరు, ఆర్సీపురం, అమీన్ పూర్, హైటెక్ సిటీ సహా పలు ప్రాంతాల్లో నాన్‌స్టాప్‌గా వాన కురుస్తోంది. గత రెండు గంటల నుంచి వర్షం పడుతుండగా.. మరో రెండు గంటలపాటు కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తం అయ్యారు. మ్యాన్‌హాల్స్ దగ్గర నీళ్లు వెళ్లేందుకు అడ్డంకులు తొలగిస్తున్నారు. అత్యవసరమైతేనే బయటకు రావాలంటూ జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. ఏదైనా అనుకోని విపత్తు సంభవిస్తే వెంటనే 040-21111111, 9000113667 నంబర్లకు ఫోన్ చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే హైదరాబాద్‌కు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌తో పాటు చుట్టుప్రక్కల జిల్లాలకు కూడా ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.