NTV Telugu Site icon

Heavy Rains: మళ్లీ దంచికొడుతున్న వానలు.. మరో 4 రోజులు భారీ వర్షాలు..

Heavy Rains

Heavy Rains

తెలంగాణలో మరోసారి వర్షాలు దంచికొడుతున్నాయి.. హైదరాబాద్‌ సహా పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.. సిటీలో ఇవాళ రెండు దపాలుగా కురిసిన వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.. లోతట్టు ప్రాంతాలకు వర్షం నీరు చేరడంతో ఇక్కట్టు పడ్డారు.. అయితే, ఎప్పటికప్పుడు వర్షం నీరు వెళ్లేవిధంగా వెంటనే సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు జీహెచ్‌ఎంసీ సిబ్బంది.. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ పోలీసులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు.. ఇవాళ నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాలో అత్య‌ధికంగా 70.6 మిల్లీమీటర్ల వ‌ర్ష‌పాతం న‌మోదు కాగా, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో 60.4 ఎం.ఎం.. జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో 51.6 ఎంఎం.. మంచిర్యాల జిల్లాలో 45.2 ఎంఎం.. పెద్ద‌ప‌ల్లిలో 42 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.. ఇదే సమయంలో మరో నాలుగు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిస్తాయని హెచ్చరికలు జారీ చేసింది హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం..

Read Also: Minister Vemula Prashanth Reddy: స్పీకర్‌కు ఈటల బేషరతుగా క్షమాపణ చెప్పాలి.. లేకుంటే చర్యలు తప్పవు..!

రానున్న నాలుగు రోజుల పాటు తెలంగాణ‌ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం పేర్కొంది.. ఈ నెల 7వ తేదీ నుంచి 10వ తేదీ వ‌ర‌కు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హెచ్చరించింది… ఉరుములు, మెరుపుల‌తో పాటు బ‌ల‌మైన ఈదురు గాలులు వీచే అవ‌కాశం ఉందని పేర్కొన్న వాతావరణ శాఖ.. ప‌లు జిల్లాల‌కు ఎల్లో, ఆరెంజ్ అల‌ర్ట్‌ల‌ను జారీ చేసింది.. బుధవారం, శ‌నివారం రోజుల్లో ఎల్లో అలెర్ట్ జారీ చేయగా.. గురువారం, శుక్ర‌వారాల్లో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.. ఇక, గురువారం రోజు హైద‌రాబాద్‌కు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం.