Site icon NTV Telugu

HCU: ఢిల్లీ తర్వాత, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎన్నికల్లో ABVP జయకేతనం..

Abvp

Abvp

HCU: ఢిల్లీ యూనివర్సిటీ తర్వాత, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లో బీజేపీ విద్యార్థి సంఘం అయిన ‘‘అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ABVP)’’ జయకేతనం ఎగరేసింది. ఏబీవీపీ-ఎస్ఎల్వీడీ కూటమి అన్ని సెంట్రల్ ప్యానెల్ పోస్టుల్ని కైవసం చేసుకుంది. కూటమికి చెందిన శివ పాలెపు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఏబీవీపీ కూటమికి చెందిన శ్రుతి ప్రియ ప్రధాన కార్యదర్శి, సౌరభ్ శుక్లా సంయుక్త కార్యదర్శి పదవుల్ని గెలుచుకున్నారు. వీనస్, జ్వాలా సాంస్కృతిక, క్రీడా కార్యదర్శులుగా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మొత్తం 81 శాతం కన్నా ఎక్కువ ఓటింగ్ నమోదైంది. ఎస్ఎఫ్ఐ, ఎన్‌ఎస్‌యూఐలపై ఏబీవీపీ సత్తా చాటింది.

Read Also: Smriti Mandhana: చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. వన్డే క్రికెట్ చరిత్రలోనే..!

ప్రతిష్టాత్మక ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీ గెలిచిన తర్వాత, హెచ్‌సీయూలో కూడా ఏబీవీపీ కూటమి గెలుపొందడంపై బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా, రాహుల్ గాంధీని జెన్-జీ యువత తిరస్కరించిందని ఆ పార్టీ నేతలు ట్వీట్స్ చేస్తున్నారు. ఇటీవల, ఓట్ చోరీ ఆరోపణలపై రాహుల్ గాంధీ ‘‘జెన్-జీ’’ పోరాడాలని పిలుపునిచ్చారు. అయితే, యువత మోడీ , బీజేపీ వెంట ఉందని వారు కామెంట్స్ చేస్తున్నారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీ క్లీన్ స్వీప్ చేసిందని బీజేపీ నేత అమిత్ మాల్వీయా ట్వీట్ చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విద్యార్థి సంఘం ఎన్ఎస్‌యూఐ తుడిచిపెట్టుకుపోయిందని, రాహుల్ గాంధీ ‘‘జెన్ Z విప్లవం’’ గురించి కలలు తొలగిపోయాయని అన్నారు. పాట్నా యూనివర్సిటీ, పంజాబ్ యూనివర్సిటీ, జేఎన్‌యూ, ఢిల్లీ యూనివర్సిటీ, గౌహతి యూనివర్సిటీ, మణిపూర్ యూనివర్సిటీ, ఉత్తరాఖండ్‌లోనే అనేక యూనివర్సిటీల్లో ఏబీవీపీ సత్తా చాటిందని, ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని కైవసం చేసుకుందని ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ సిక్స్ ప్యాక్స్ చూపించి, స్టేజ్‌లపై తిరగడం యువతను ఆకట్టుకోదని అన్నారు.

Exit mobile version